నోటాకూ ఓ ఎన్నికల గుర్తు!
నోటా... భారతీయ ఎన్నికల విధానంలోనే ఓ విప్లవాత్మక మార్పు. పైన ఉన్న అభ్యర్థులెవరూ తమకు ఇష్టం లేని పక్షంలో ఓటుహక్కును వదులుకోకుండా.. ఓటు వేస్తూనే, ఎవరికీ వేయకుండా ఉండే పద్ధతి ఇది. ఇన్నాళ్లూ దానికి 'నోటా' అనే ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే ఈవీఎంలో కనిపించేవి. కానీ తొలిసారిగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో నోటాకు కూడా ఓ గుర్తును ఉపయోగించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ తెలిపారు.
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును ప్రకటించే సందర్భంగా ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్‌తో సంప్రదించి, ఓ గుర్తును రూపొందించామని ఆయన మీడియాకు చెప్పారు. 2013 అక్టోబర్ 11వ తేదీ నుంచి నోటా అమలులోకి వచ్చింది.