లేటు వయసులోనూ ఇరగదీశారు!!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
వాళ్లిద్దరూ 90 ఏళ్లు దాటినవాళ్లే. సాధారణంగా ఆ వయసు వచ్చిందంటే కృష్ణా రామా అనుకుంటూ.. ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్లిపోతాడా అని ఎదురు చూస్తుంటారు. కానీ, ఇద్దరు వృద్ధులు మాత్రం తమకు వయసు మీద పడుతున్నా మనసు మాత్రం ఇప్పటికీ యంగే అంటున్నారు. ఎన్నికల బరిలో దూసుకెళ్లి తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఒకరు తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కాగా, మరొకరు కేరళలో సీపీఎం కురువృద్ధ నేత వీఎస్ అచ్యుతానందన్. కరుణానిధికి రేపు జూన్ 3వ తేదీకి 92 ఏళ్లు నిండుతాయి. ఇక వీఎస్ అచ్యుతానందన్ వయసు ఇంకా ఎక్కువ. ఆయనకు 93 ఏళ్లు.
సాధారణంగా రాజకీయాల్లో వయసు గురించి మరీ అంత ఎక్కువగా పట్టించుకోరు. కొన్ని జాతీయ పార్టీల యువజన విభాగాల అధ్యక్షులు 40 ఏళ్లకు పైబడిన వాళ్లు కూడా ఉంటారు. కానీ, 90 ఏళ్లు దాటాయంటే మాత్రం వ్యూహాలు రచించడం, వేగంగా దూసుకెళ్లడం కొంత కష్టమే. అందులోనూ కరుణానిధి చాలా కాలంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. మోటారైజ్డ్ వీల్ చైర్ సాయంతోనే ఆయన తన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. దాంట్లోనే వెళ్లి ప్రచారం కూడా చేశారు. ఇటీవల జాతీయ మీడియా ప్రతినిధులు తమిళనాడు ఎన్నికలకు ముందు ఈసారి స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించినప్పుడు కూడా.. డీఎంకే అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, తనకు ఏమైనా అయితే తప్ప స్టాలిన్ ముఖ్యమంత్రి కాలేడని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లే ముఖ్యమంత్రి జయలలిత మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడంలోను, తమిళ ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోను ఆయన ఒకరకంగా విజయం సాధించినట్లేనని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.
ఇక కేరళలో కూడా వీఎస్ అచ్యుతానందన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆయన కూడా 93 ఏళ్ల వయసులోనూ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటూ ఎన్నికల్లో దూసుకెళ్లారు. నిజానికి సొంత కూటమిలోనే పినరయి విజయన్ లాంటి నేతల నుంచి ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉన్నా.. వాళ్లందరి కంటే తానే దానికి సమర్థుడినని చెప్పడమే కాక, నిరూపించుకున్నారు కూడా. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ కూటమికి దాదాపు 79 వరకు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సాధారణ మెజారిటీ అంటే 71 సీట్లు వస్తే చాలు. దాంతో అచ్యుతానందన్ సీఎం కావడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు.