తాను మునిగి.. కరుణను ముంచిన కెప్టెన్
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పరాజయానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కెప్టెన్ విజయకాంతే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కెప్టెన్ తాను మునగడంతో పాటు.. కరుణను కూడా ముంచేశాడని చెబుతున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగానే ఎన్నికల్లో తమంతట తాముగా విజయం సాధించలేని కొన్ని పార్టీలు.. కొంతమేర ఓట్లను చీల్చుకోవడంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుంది. దాంతో ప్రతిపక్షాలు విజయం సాధించడం అసాధ్యం అవుతుంది. తమిళనాడులో సరిగ్గా ఇదే జరిగిందని విశ్లేషకులు వివరించారు. అమ్మ పాలనపై కొంతమేర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో 91 ఏళ్ల వయసులో కరుణానిధి మండుటెండల్లో కూడా ఉధృతంగా ప్రచారం చేయడంతో ఆయన మీద సానుభూతి కలిగింది.
కానీ, అదే సమయంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ రంగప్రవేశం చేయడం, ప్రజాస్వామ్య కూటమి పేరుతో కొన్ని పార్టీలను జత చేసుకోవడంతో కొంతమేర ఓట్లు చీలిపోయాయి. చాలా స్థానాల్లో డీఎంకే - అన్నాడీఎంకే అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా అతి స్వల్పంగా ఉంది. అదే డీఎంకే, ప్రజాస్వామ్య కూటమి ఓట్లను కలుపుకొంటే మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టే కెప్టెన్ తాను స్వయంగా సీఎం కాలేకపోయినా.. ముఖ్యమంత్రి కావాలన్న కరుణానిధి ఆశలకు కూడా గండికొట్టారు.