నా తుది శ్వాస వరకూ పోరాడుతా: జయలలిత
చెన్నై: అపూర్వ విజయాన్ని అందించిన తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు చాలవని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. 32ఏళ్ల చరిత్రను తిరగరాసిన జయలలిత మరోసారి అధికార పీఠం ఎక్కనున్నారు. చారిత్రాక విజయం అందించిన ప్రజలకు, మద్దతుదారులకు పురచ్చితలైవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని, తన జీవితమంతా ప్రజల సేవకే అంకితమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతాననని, ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
తన తుది శ్వాస వరకూ తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తానని జయలలిత స్పష్టం చేశారు. పార్టీ విజయానికి పాటుపడిన పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా తమిళనాట అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. దీంతో జయలలిత నివాసం పోయిస్ గార్డెన్ వద్ద పార్టీ నేతలు, శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు అమ్మకు అభినందనలు పరంపర వెల్లువెత్తింది. పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు అమ్మ నివాసానికి క్యూ కట్టారు. బాణాసంచా పేల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.