jayalalithaa record
-
నా తుది శ్వాస వరకూ పోరాడుతా: జయలలిత
చెన్నై: అపూర్వ విజయాన్ని అందించిన తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు చాలవని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. 32ఏళ్ల చరిత్రను తిరగరాసిన జయలలిత మరోసారి అధికార పీఠం ఎక్కనున్నారు. చారిత్రాక విజయం అందించిన ప్రజలకు, మద్దతుదారులకు పురచ్చితలైవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని, తన జీవితమంతా ప్రజల సేవకే అంకితమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతాననని, ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన తుది శ్వాస వరకూ తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తానని జయలలిత స్పష్టం చేశారు. పార్టీ విజయానికి పాటుపడిన పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా తమిళనాట అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. దీంతో జయలలిత నివాసం పోయిస్ గార్డెన్ వద్ద పార్టీ నేతలు, శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు అమ్మకు అభినందనలు పరంపర వెల్లువెత్తింది. పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు అమ్మ నివాసానికి క్యూ కట్టారు. బాణాసంచా పేల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. -
32 ఏళ్ల తర్వాత.. జయలలిత రికార్డు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో రెండు చోట్ల అధికార మార్పిడి జరిగింది. ఆ రెండు చోట్లా పురుషులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న తరుణ్ గొగోయ్ అసోంలోను, గత ఎన్నికల తర్వాత కేరళ సీఎం అయిన ఊమెన్ చాందీ.. ఇద్దరూ తమ అధికారాన్ని ఈసారి నిలబెట్టుకోలేకపోయారు. అయితే.. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళలు జయలలిత, మమతా బెనర్జీ మాత్రం చరిత్ర తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. తమిళనాడులో నిజానికి ఇప్పటివరకు ఎంజీ రామచంద్రన్ తర్వాత ఏ ఒక్కరూ రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి కాలేదు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ ప్రతిసారీ అధికార మార్పిడి జరుగుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం జయలలిత రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ కూడా రికార్డు సృష్టిస్తున్నారు. ఆమె కూడా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఇంతకుముందు ఆమెకు వచ్చిన స్థానాల కంటే కూడా ఎక్కువ వచ్చేలా కనిపిస్తున్నాయి. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రస్తుతం టీఎంసీకి 184 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా 216 స్థానాలలో టీఎంసీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీని దీదీ సాధించినట్లయింది.