tamilnadu results
-
ఊహించినదే.. నథింగ్ స్పెషల్: నితీశ్
పట్నా: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినవే అని, ప్రత్యేకతేమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అసోంలో బీజేపీ, కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ...గెలుపు సారధిలుకు అభినందనలు తెలిపారు. యూపీలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను సమాజ్వాదీ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. -
వరుసగా 13వ సారి ఆయన గెలిచారు
చెన్నై : చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైనా, ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మాత్రం భారీ మెజార్టీతో విజయం సాధించారు. తిరువరూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఏకంగా 13వ సారి 65వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటివరకూ కరుణానిధి ఇప్పటివరకూ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది రికార్డు సృష్టించారు. కాగా అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. తమిళనాడు ప్రజలు మరోసారి జయలలితకు జై కొట్టారు. ఇక ఎగ్జిట్ పోల్స్ తలకిందులు కావటంతో డీఎంకే భంగపాటు పడింది. ప్రభుత్వ వ్యతిరేకతను డీఎంకే సొమ్ము చేసుకోలేకపోవడంతో రెండో స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. భారీగా ఉచిత వరాలు ప్రకటించినా, ప్రజలు మాత్రం 'కరుణ' చూపలేదు. అయితే చెన్నై నగరంలో మాత్రం మెజార్టీ స్థానాల్లో డీఎంకే ఆధిక్యం కొనసాగుతోంది. -
నా తుది శ్వాస వరకూ పోరాడుతా: జయలలిత
చెన్నై: అపూర్వ విజయాన్ని అందించిన తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు చాలవని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. 32ఏళ్ల చరిత్రను తిరగరాసిన జయలలిత మరోసారి అధికార పీఠం ఎక్కనున్నారు. చారిత్రాక విజయం అందించిన ప్రజలకు, మద్దతుదారులకు పురచ్చితలైవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని, తన జీవితమంతా ప్రజల సేవకే అంకితమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతాననని, ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన తుది శ్వాస వరకూ తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తానని జయలలిత స్పష్టం చేశారు. పార్టీ విజయానికి పాటుపడిన పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా తమిళనాట అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. దీంతో జయలలిత నివాసం పోయిస్ గార్డెన్ వద్ద పార్టీ నేతలు, శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు అమ్మకు అభినందనలు పరంపర వెల్లువెత్తింది. పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు అమ్మ నివాసానికి క్యూ కట్టారు. బాణాసంచా పేల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. -
32 ఏళ్ల తర్వాత.. జయలలిత రికార్డు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో రెండు చోట్ల అధికార మార్పిడి జరిగింది. ఆ రెండు చోట్లా పురుషులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న తరుణ్ గొగోయ్ అసోంలోను, గత ఎన్నికల తర్వాత కేరళ సీఎం అయిన ఊమెన్ చాందీ.. ఇద్దరూ తమ అధికారాన్ని ఈసారి నిలబెట్టుకోలేకపోయారు. అయితే.. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళలు జయలలిత, మమతా బెనర్జీ మాత్రం చరిత్ర తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. తమిళనాడులో నిజానికి ఇప్పటివరకు ఎంజీ రామచంద్రన్ తర్వాత ఏ ఒక్కరూ రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి కాలేదు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ ప్రతిసారీ అధికార మార్పిడి జరుగుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం జయలలిత రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ కూడా రికార్డు సృష్టిస్తున్నారు. ఆమె కూడా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఇంతకుముందు ఆమెకు వచ్చిన స్థానాల కంటే కూడా ఎక్కువ వచ్చేలా కనిపిస్తున్నాయి. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రస్తుతం టీఎంసీకి 184 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా 216 స్థానాలలో టీఎంసీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీని దీదీ సాధించినట్లయింది. -
తాను మునిగి.. కరుణను ముంచిన కెప్టెన్
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పరాజయానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కెప్టెన్ విజయకాంతే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కెప్టెన్ తాను మునగడంతో పాటు.. కరుణను కూడా ముంచేశాడని చెబుతున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లుగానే ఎన్నికల్లో తమంతట తాముగా విజయం సాధించలేని కొన్ని పార్టీలు.. కొంతమేర ఓట్లను చీల్చుకోవడంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుంది. దాంతో ప్రతిపక్షాలు విజయం సాధించడం అసాధ్యం అవుతుంది. తమిళనాడులో సరిగ్గా ఇదే జరిగిందని విశ్లేషకులు వివరించారు. అమ్మ పాలనపై కొంతమేర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో 91 ఏళ్ల వయసులో కరుణానిధి మండుటెండల్లో కూడా ఉధృతంగా ప్రచారం చేయడంతో ఆయన మీద సానుభూతి కలిగింది. కానీ, అదే సమయంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ రంగప్రవేశం చేయడం, ప్రజాస్వామ్య కూటమి పేరుతో కొన్ని పార్టీలను జత చేసుకోవడంతో కొంతమేర ఓట్లు చీలిపోయాయి. చాలా స్థానాల్లో డీఎంకే - అన్నాడీఎంకే అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా అతి స్వల్పంగా ఉంది. అదే డీఎంకే, ప్రజాస్వామ్య కూటమి ఓట్లను కలుపుకొంటే మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టే కెప్టెన్ తాను స్వయంగా సీఎం కాలేకపోయినా.. ముఖ్యమంత్రి కావాలన్న కరుణానిధి ఆశలకు కూడా గండికొట్టారు. -
కెప్టెన్ హీరో కాదు.. జీరోనే!
అంతన్నాడు ఇంతన్నాడే.. గంగరాజు నట్టేట్లో ముంచేశాడే అన్నట్లుగా తయారైంది కెప్టెన్ విజయకాంత్ పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ముఖ్యమంత్రి కుర్చీ సొంతం చేసుకుంటానని చెప్పిన కెప్టెన్.. అసలు ఖాతాయే తెరవలేదు. స్వయంగా విజయకాంత్ కూడా తాను పోటీ చేసిన స్థానంలో వెనుకంజలోనే ఉన్నారు. డీఎండీకే అధినేతగా పరుష వ్యాఖ్యలు చేసి, మీడియాపై కూడా మండిపడిన విజయకాంత్, చివరకు సొంత పార్టీ నేతలపై కూడా అనుచితంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జాతీయ మీడియాలో ప్రసారమైన ఇంటర్వ్యూలో అయితే.. తాను హీరోనని, కరుణానిధి విలన్ అని, జయలలిత లేడీ విలన్ అని కూడా వ్యాఖ్యానించారు. కానీ చివరకు తాను పోటీ చేసిన ఉళుందుర్ పెట్టాయ్ నియోజకవర్గంలో మూడోస్థానంలో నిలిచారు. అక్కడ ఆధిక్యంలో అన్నాడీఎంకే ఉండగా, రెండో స్థానంలో డీఎంకే ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య కూటమిని కూడా ఏర్పాటుచేశారు. రజనీకాంత్లా పిరికివాడిని కానని ఒక సమయంలో వ్యాఖ్యానించడంతో రజనీ అభిమానులు కెప్టెన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చివరకు అనుకున్నట్లే అయ్యింది. తన పార్టీ అభ్యర్థులలో ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయిన విజయకాంత్.. చివరకు తాను కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో కెప్టెన్ తాను మునగడంతో పాటు ఓడను కూడా ముంచేశాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
తమిళనాడులో అంచనా తప్పింది
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్లు ఉత్కంఠ రేపాయి. తొలుత డీఎంకే కూటమి ముందంజలో ఉన్నట్లు కనిపించినా, మళ్లీ అమ్మ పుంజుకుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో కడపటి వార్తలు అందేసరికి అన్నా డీఎంకే 141 స్థానాల్లోను, డీఎంకే 86 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి. జాతీయ మీడియా మొత్తం డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పగా, అంచనా తప్పింది. స్థానికంగా ఉన్న తమిళ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అమ్మకే ఆధిక్యం వస్తోంది. గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కరుణ కుమార్తె కనిమొళి, కొడుకు స్టాలిన్, ఇంకా ముఖ్యమైన నేతలంతా అక్కడే ఉండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. తుది ఫలితాలు వెలువడే సమయానికి వాళ్లంతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జయ నివాసం పోయస్ గార్డెన్స్ వద్ద సందడి నెలకొంది.