vs achchutanandan
-
ఆ ఇద్దరికీ అపూర్వ సన్మానం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రాంగణం అరుదైన ఘటనకు వేదికైంది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం ఆవిర్భావం కోసం అప్పటి సీపీఐతో విభేదించి బయటకు వచ్చిన ఇద్దరు కమ్యూనిస్టు యోధులను ఘనంగా సన్మానించారు. ఆ ఇద్దరు.. పార్టీ తొలి కేంద్ర కమిటీ సభ్యులైన కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (95), తమిళనాడుకు చెందిన పార్టీ నేత శంకరన్ (96). పార్టీ మహాసభలకు వీరిని అతిథులుగా ఆహ్వానించిన సీపీఎం నేతలు మహాసభల వేదికపై సత్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారి మెడలో దండలు వేశారు. పార్టీ మూలస్తంభాలైన ఈ ఇద్దరు నేతల కృషి మరువలేనిదని కొనియాడారు. అచ్యుతానందన్, శంకరన్‌లు కనీసం నడవలేని స్థితిలో ఉన్నా.. సహాయకులను వెంటబెట్టుకుని సభలకు హాజరవడం విశేషం. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మాణిక్ సర్కార్ సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ప్రజావ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. బుధవారం ప్రారంభమైన పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మతతత్వ విధానాలతో నేరుగా ప్రజాస్వామ్యంపై దాడికి బీజేపీ, సంఘ్ పరివార్లు తెగబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష, ప్రజాతంత్ర కూటమి మాత్రమే దేశ ప్రజల నిజమైన కూటమి అని అన్నారు. మార్క్సిస్టు యోధులకు సంతాపం మహాసభల్లో తొలిరోజు పలువురు మార్క్సిస్టు యోధులకు నివాళి అర్పించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానంలో ఖగేన్‌దాస్, పుకుమోల్‌సేన్, నూరుల్‌హుడా, సుబో«ధ్ మెహతాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పులువురు నేతలకు సంతాపం ప్రకటించారు. తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి, ట్రేడ్ యూనియన్ నేతలు పర్సా సత్యనారాయణ, తిరందాసు గోపిలకు కూడా మహాసభ నివాళి అర్పించింది. బెంగాల్, త్రిపుర, బిహార్, మహారాష్ట్రల్లో హత్యలకు గురైన పార్టీ నేతలను సంస్మరించుకున్నారు. -
సీపీఎం సంచలన నిర్ణయం
కేరళలో ఎల్డీఎఫ్కు విజయాన్ని అందించిన కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్‌కు చుక్కెదురైంది. పినరయి విజయన్ను ముఖ్యమంత్రిగా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఎవరుండాలనే విషయాన్ని నిర్ణయించేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో సమావేశమైంది. ఈ సమావేశానికి అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కరత్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే.. విజయన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని అగ్రనేతలు చెప్పడంతో అచ్యుతానందన్ నొచ్చుకుని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే సమావేశం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి ఇంకా ఎక్కడా ప్రకటించలేదు. 92 ఏళ్ల వయసులో కూడా లెఫ్ట్ ఫ్రంట్ విజయం కోసం కష్టపడిన తనను కనీసం కొన్నాళ్లయినా ముఖ్యమంత్రి పదవిలో ఉండనిచ్చి, ఆ తర్వాత పినరయి విజయన్(72)కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అచ్యుతానందన్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సమావేశం జరుగుతుండగా మధ్యలోనే లేచి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లిపోయారని అంటున్నారు. -
లేటు వయసులోనూ ఇరగదీశారు!!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) వాళ్లిద్దరూ 90 ఏళ్లు దాటినవాళ్లే. సాధారణంగా ఆ వయసు వచ్చిందంటే కృష్ణా రామా అనుకుంటూ.. ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్లిపోతాడా అని ఎదురు చూస్తుంటారు. కానీ, ఇద్దరు వృద్ధులు మాత్రం తమకు వయసు మీద పడుతున్నా మనసు మాత్రం ఇప్పటికీ యంగే అంటున్నారు. ఎన్నికల బరిలో దూసుకెళ్లి తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఒకరు తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కాగా, మరొకరు కేరళలో సీపీఎం కురువృద్ధ నేత వీఎస్ అచ్యుతానందన్. కరుణానిధికి రేపు జూన్ 3వ తేదీకి 92 ఏళ్లు నిండుతాయి. ఇక వీఎస్ అచ్యుతానందన్ వయసు ఇంకా ఎక్కువ. ఆయనకు 93 ఏళ్లు. సాధారణంగా రాజకీయాల్లో వయసు గురించి మరీ అంత ఎక్కువగా పట్టించుకోరు. కొన్ని జాతీయ పార్టీల యువజన విభాగాల అధ్యక్షులు 40 ఏళ్లకు పైబడిన వాళ్లు కూడా ఉంటారు. కానీ, 90 ఏళ్లు దాటాయంటే మాత్రం వ్యూహాలు రచించడం, వేగంగా దూసుకెళ్లడం కొంత కష్టమే. అందులోనూ కరుణానిధి చాలా కాలంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. మోటారైజ్డ్ వీల్ చైర్ సాయంతోనే ఆయన తన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. దాంట్లోనే వెళ్లి ప్రచారం కూడా చేశారు. ఇటీవల జాతీయ మీడియా ప్రతినిధులు తమిళనాడు ఎన్నికలకు ముందు ఈసారి స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించినప్పుడు కూడా.. డీఎంకే అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, తనకు ఏమైనా అయితే తప్ప స్టాలిన్ ముఖ్యమంత్రి కాలేడని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లే ముఖ్యమంత్రి జయలలిత మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడంలోను, తమిళ ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోను ఆయన ఒకరకంగా విజయం సాధించినట్లేనని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇక కేరళలో కూడా వీఎస్ అచ్యుతానందన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆయన కూడా 93 ఏళ్ల వయసులోనూ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటూ ఎన్నికల్లో దూసుకెళ్లారు. నిజానికి సొంత కూటమిలోనే పినరయి విజయన్ లాంటి నేతల నుంచి ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉన్నా.. వాళ్లందరి కంటే తానే దానికి సమర్థుడినని చెప్పడమే కాక, నిరూపించుకున్నారు కూడా. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ కూటమికి దాదాపు 79 వరకు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సాధారణ మెజారిటీ అంటే 71 సీట్లు వస్తే చాలు. దాంతో అచ్యుతానందన్ సీఎం కావడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు.