సీపీఎం సంచలన నిర్ణయం
కేరళలో ఎల్డీఎఫ్‌కు విజయాన్ని అందించిన కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్‌కు చుక్కెదురైంది. పినరయి విజయన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఎవరుండాలనే విషయాన్ని నిర్ణయించేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో సమావేశమైంది. ఈ సమావేశానికి అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కరత్ తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలోనే.. విజయన్‌ను ముఖ్యమంత్రిగా చేస్తామని అగ్రనేతలు చెప్పడంతో అచ్యుతానందన్ నొచ్చుకుని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే సమావేశం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి ఇంకా ఎక్కడా ప్రకటించలేదు.
92 ఏళ్ల వయసులో కూడా లెఫ్ట్ ఫ్రంట్ విజయం కోసం కష్టపడిన తనను కనీసం కొన్నాళ్లయినా ముఖ్యమంత్రి పదవిలో ఉండనిచ్చి, ఆ తర్వాత పినరయి విజయన్(72)కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అచ్యుతానందన్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సమావేశం జరుగుతుండగా మధ్యలోనే లేచి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లిపోయారని అంటున్నారు.