కార్మికుడి కుటుంబానికి సీఎం క్షమాపణ
టీ.నగర్: కొల్లం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమిళనాడు కార్మికుడి కుటుంబానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. తిరునెల్వేలి జిల్లా దురై నివాస గృహాలకు చెందిన మురుగన్ (30), అతడి స్నేహితుడు ముత్తు.. కేరళలోని కొల్లం జిల్లా సాత్తనూరు సమీపంలో ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రి సహా ఆరు ఆస్పత్రులకు తీసుకెళ్లినప్పటికీ న్యూరోసర్జన్, వెంటిలేటర్ సౌకర్యం లేదని తెలుపుతూ చికిత్సలు అందించేందుకు నిరాకరించారు. దీంతో మురుగన్ మృతి చెందాడు.
ఈ ఘటనపై పినరయి విజయన్ గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. సకాలంలో చికిత్స చేయకపోవడం వల్లే మురుగన్ మృతి చెందాడని తెలిపారు. 'రాష్ట్రం, ప్రజల తరపున మురుగన్ కుటుంబానికి క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటాం. ఇందుకోసం చట్టం తెస్తాం లేదా ప్రస్తుతం ఉన్న నిబంధనలు మారుస్తామ'ని ఆయన ప్రకటించారు. ఈ దారుణోదంతం తమ రాష్ట్రానికి మచ్చగా భావిస్తున్నామని, దీనిపైసమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే అతని కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని విజయన్ తెలిపారు. మరోవైపు చికిత్స నిరాకరించిన ఐదు ఆస్పత్రులపై ఐపీసీ సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.