ఆట మొదలైంది.. విజయం మాదే..
చండీగఢ్: పంజాబ్, గోవా ఎన్నికల్లో తమదే విజయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ఆట మొదలైంది.. పంజాబ్, గోవాల్లోని అధికార పార్టీలకు పతనం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 4న జరగబోయే పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాల్లో ఆప్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైనందున పంజాబ్, గోవా ప్రజలు ఇక కేవలం తమకే మద్దతిస్తారని, ఆప్ తరఫున పని చేస్తారని పేర్కొన్నారు. పంజాబ్‌లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని, ఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్యేలే తమ సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. గోవాలో మాత్రం మాజీ జైళ్ల శాఖ జనరల్ ఇన్‌స్పెక్టర్ ఎల్విస గోమెస్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లు వెల్లడించారు.