కమలం కదలికలపై 'గులాబీ' కన్ను! | TRS keeps eagle eye on BJP | Sakshi
Sakshi News home page

కమలం కదలికలపై 'గులాబీ' కన్ను!

Published Sun, Apr 9 2017 1:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కమలం కదలికలపై 'గులాబీ' కన్ను! - Sakshi

కమలం కదలికలపై 'గులాబీ' కన్ను!

కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నా.. బీజేపీ దూకుడుపై అధికార పార్టీ నజర్‌
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో హవాతో ‘కమలం’ జోరు
- తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ
- రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు
- వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్‌
- సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు చర్యలు షురూ..


సాక్షి, హైదరాబాద్‌: యూపీలో ఘనవిజయం ధీమాతో బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందా? అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌.. వలసలతో నిర్వీర్యమై టీడీపీ చేతులెత్తేస్తున్నాయన్న అంచనాతో కమలం పార్టీ 2019 ఎన్నికలకు ఇప్పట్నుంచే అస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా? టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ఇటీవల కమలనాథులు పదేపదే చెప్పడం వెనక వ్యూహమిదేనా? టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు, ప్రతివ్యూహంపై కొనసాగుతున్న సమాలోచనలను బట్టి చూస్తే ఇవే అభిప్రాయాలు కలుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను గులాబీ దళం నిశితంగా పరిశీలిస్తోందని విదితమవుతోంది.

రెండేళ్ల ముందు నుంచే..
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువుండగానే టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. పార్టీ 16వ ప్లీనరీ సందర్భంగా జిల్లాకో మినీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఇదంతా కేడర్‌ను సమీకరించుకుని, స్థిర పరుచుకోవడానికేనన్నది స్పష్టమవుతోంది. అయితే టీఆర్‌ఎస్‌ ఇంత దూకుడుగా వెళ్లడానికి కారణం.. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టిందని గుర్తించడమేనని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో, ప్రణాళికాబద్ధంగా, ఒక వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోందన్న అంచనాకు టీఆర్‌ఎస్‌ వచ్చిందని చెబుతున్నారు.

పక్కా ప్రణాళికతో..
ముఖ్యంగా బీజేపీ తెలంగాణవ్యాప్తంగా ఏడు లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. అందులో ఆరు నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్‌చార్జులుగా కూడా నియమించి నియోజకర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది. వాటిలో తొలి సమావేశం భువనగిరిలో జరగగా కేంద్ర మంత్రి జవదేకర్‌ హాజరయ్యారు. మిగతా సమావేశాలనూ త్వరలోనే నిర్వహించే అవకాశముంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఇన్‌చార్జిగా వస్తున్నారని, నిజామాబాద్‌కు నితిన్‌ గడ్కరీ, కరీంనగర్‌కు పురుషోత్తం రూపాల, మహబూబ్‌నగర్‌కు అనంత్‌ కుమార్, వరంగల్‌కు పొన్ను రాధాకృష్ణ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇక్కడి నుంచి దత్తాత్రేయ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఇక మల్కాజ్‌గిరి, మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక దానికి కూడా ఇన్‌చార్జి బాధ్యతలను ఓ కేంద్ర మంత్రికి అప్పజెప్పనున్నట్లు సమాచారం.

అసెంబ్లీ నియోజకవర్గాలపైనా దృష్టి
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గతంలో బీజేపీ గెలిచిన అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నారని.. వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల (అర్బన్‌ ప్రాంతపు)లో కూడా పట్టు పెంచుకునే దిశలో బీజేపీ అడుగులు వేస్తోందన్న సమాచారాన్ని టీఆర్‌ఎస్‌ సేకరించినట్లు తెలుస్తోంది. కనీసం 35 అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి పెట్టనుందని చెబుతున్నారు.

రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ గురి
టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న ఆ సామాజికవర్గం ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా ముద్రపడిన వారి వివరాలు సేకరించి వారితో ఢిల్లీ నేతలే రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం. కొద్దికాలం క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ పార్లమెంట్‌ సభ్యుడితో బీజేపీ సీనియర్‌ నేత ఒకరు ఢిల్లీలో మంతనాలు జరిపారు. కొందరు కాంగ్రెస్‌ నాయకులతోనూ బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరి నాటికి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

సర్వే ఫలితాలతో కేసీఆర్‌ ధీమా
టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ఎంపీల పనితీరుపై ఓ సర్వే చేయించారు. రాష్ట్రంలోని పదిహేడు లోక్‌సభ నియోజకవర్గాల్లో పదిహేను చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని పార్టీ నేతల అంతర్గత సమావేశంలో ప్రకటించారు. సికింద్రాబాద్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య పోటీ ఉంటుందని, హైదరాబాద్‌ స్థానం ఎంఐఎం ఖాతాలో చేరుతుందన్న అభిప్రాయంతో టీఆర్‌ఎస్‌ ఉంది. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై, అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితిపై కూడా కేసీఆర్‌ సర్వే చేయించారు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు సరిగాలేని చోట కూడా పార్టీ పరిస్థితి బాగుందన్న విషయం సర్వేలో తేలింది కాబట్టి ధీమాగానే ఉన్నారు. కానీ ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగడం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయంతో ఆత్మవిశ్వాసంలో ఉన్న బీజేపీ... తెలంగాణపై దృష్టి సారించిందన్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ సీరియస్‌గానే భావిస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్‌నే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నా.. ఈ మధ్య బీజేపీ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగడంతో అధికార పార్టీ అప్రమత్తమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్లే సంస్థాగత కార్యక్రమాలను పెంచిందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టిందన్న విషయాన్ని ఓ అధికార పార్టీ ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా.. ‘ప్రతి రాజకీయ పార్టీకి వారి వారి వ్యూహాలు ఉంటాయి. ఎక్కడ ‘కమ్యూనల్‌’సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి అవకాశం ఉందో.. అక్కడే వారు (బీజేపీ) దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు హిందూ సంఘాల నేతలు వాటిలో కొన్ని చోట్ల మీటింగులు కూడా పెట్టిపోయారు. అయినా టీఆర్‌ఎస్‌ ఎందుకు బెంబేలు పడిపోవాలి. ఎవరి రాజకీయం వారిదే. మా పార్టీకి ప్రజల ఆదరణ తప్పక ఉంటుంది..’’అని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ దూకుడును తేలిగ్గా తీసుకోవడం లేదని, ప్రతివ్యూహ రచనలో టీఆర్‌ఎస్‌ ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement