హైదరాబాద్: రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించలేదనడం..కరెక్షన్ మాత్రమే చేశారన్న ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..అంబేద్కర్‌ను కించపరచడమే బీజేపీ విధానమా అని ప్రశ్నించారు. శాఖల వారీగా విద్యావంతుల వేదిక లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన వారిపై టీఆర్‌ఎస్ నాయకులు మూకుమ్మడి దాడి చేయడం దురదృష్టకరం అని, ఫిరాయింపుల్లో, అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌కే అవార్డు దక్కుతుందని అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగారుస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యావ్వవస్థను బలహీన పరుస్తున్నదన్నారు. బీసీ సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. రెండేళ్లలో నియంతృత్వ పాలన, ప్రచార ఆర్భాటం మినహా తెలంగాణలో జరిగిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. కాంగ్రెస్‌తో పాటు విద్యావంతుల వేదిక శాఖల వారీగా లేవనెత్తిన అంశాలపై మంత్రులు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.