పొన్నం ప్రభాకర్(పాత చిత్రం)
సాక్షి, కరీంనగర్: బీజేపీతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం కారణంగానే టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం అవుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలతో నష్టమనే టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడిందని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు మొగ్గుచూపిన బీజేపీ ముందస్తు ఎన్నికలకు సంసిద్ధత ఎందుకు తెలుపుతుందో సమాధానం చెప్పాలన్నారు.
అసెంబ్లీని రద్దు చేయడంతో మూడు నెలల ముందే ఎన్నికల కోడ్ వస్తుందని, పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరో మూడు నెలలు ఎన్నికల కోడ్ వస్తుందని.. దీంతో ఆరు నెలల పాటు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల సవరణ నమోదు కార్యక్రమానికి 2019 జనవరి 4వ తేదీ వరకు గడువు విధించగా ముందస్తు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నాయకత్వం అసహనంగా ఉందని.. మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సాంకేతిక అడ్డంకులను ఏ విధంగా తొలిగిస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment