
బడ్జెట్ 2022లో భాగంగా ఇవాళ్టి ఉదయం(సోమవారం) నుంచి పార్లమెంట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలను లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వ్యూహాల్లో ప్రతిపక్షాలు సిద్ధం అయ్యాయి. పైగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పైగా పెగాసస్ ప్రకంపనలతో ఉభయసభల్లో తమ వాణి బలంగా వినిపించేందుకు పోటాపోటీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు.
సాక్షి, న్యూఢిల్లీ: ఇక నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతుండగా.. ఇవాళ్టి షెడ్యూల్‌లో కేవలం ఆర్థికసర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం 30 నిమిషాలపాటు సాగనుంది. ప్రసంగం అనంతరం లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజే ఉభయసభల్లోనూ 'ఎకనామిక్ సర్వే' (2021-2022)ను ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి.
మంత్రి బడ్జెట్ ప్రసంగానంతరం రాజ్యసభ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇవాళ తొలి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాజ్యసభ మొదలవ్వనుంది. ఉభయసభల్లోనూ వేర్వేరుగా ప్రధాని రెండు సార్లు మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. అలాగే మ.3 గంటలకు అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉండగా.. సా.5 గం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో వర్చువల్‌గా బడ్జెట్ షెషన్‌పై మరోసారి అఖిలపక్ష భేటీ జరగనుంది. అదే విధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపైనా పార్టీలకు ఆయన పలు సూచనలు చేయనున్నారు.
రేపు, అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు కేంద్ర కేబినెట్ భేటీ అయ్యి బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది. ఫిబ్రవరి 2 నుంచి కోవిడ్ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా షిఫ్ట్ పద్ధతిలో లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలు. రాజ్యసభ కార్యక్రమాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అనంతరం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లోక్‌సభ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈసారి రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 11 వరకూ బడ్జెట్ తొలి విడత సమావేశాలు, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి.
టీఆర్ఎస్ ఎంపీల నిరసన!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచే నిరసన తెలపాలని తెలంగాణ రాష్ట్ర టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు నిర్ణయించారు. గత ఏడు ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయం చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిరసన పేరిట రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించడంతో పాటు పార్లమెంటు బయట, లోపల నిరసనలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.