సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతాల పరిధిలో 70 శాతం నియోజక వర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని ‘ఇండియాస్పెండ్’ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 80 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 30 చోట్ల మోదీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో 23 సీట్లను బీజేపీ గెలుచుకోగా, 57 సీట్లలో ఓడిపోయింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 54 నియోజకవర్గాల పరిధిలో 22 ఎన్నికల ర్యాలీలు (అంటే 70 శాతానికిపైగా) ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించగా, 22 సీట్లను (41 శాతం) గెలుచుకోగలిగింది. ఇక చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లోని 26 నియోజక వర్గాల పరిధిలో మోదీ ఎనిమిది ర్యాలీలు నిర్వహించగా, ఒకే ఒక్క సీటును బీజేపీ గెలుచుకుంది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి 58 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ 27 సీట్లను గెలుచుకుంది. 42 సీట్లను కోల్పోయిందని ఇండియాస్పెండ్ విశ్లేషించింది. ఈ విషయంలో మోదీ కన్నా యోగి పర్యటించిన ప్రాంతాల్లోనే బీజేపీ కాస్త ఎక్కువ విజయం సాధించింది.
మోదీ పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 28.75 స్థానాల్లో, యోగి పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 39.3 శాతం విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యోగి 27 బహిరంగ సభలు నిర్వహించగా, 37 స్థానాలకుగాను 21 స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. ఇక చత్తీస్‌గఢ్‌లో యోగి 23 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ కేవలం ఐదు సీట్లను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment