అళగిరి దెబ్బ కొట్టాడా?
మదురై.. ఈ ప్రాంతం అంతా కరుణానిధి పెద్దకొడుకు అళగిరికి పెట్టని కోట. అక్కడ ఆయన గీసిందే గీత.. చెప్పిందే వేదం. కానీ అలాంటి మదురై ప్రాంతంలో ఉన్న మొత్తం 10 సీట్లకు గాను డీఎంకే 8 చోట్ల ఓడిపోయింది. ఎందుకిలా జరిగిందని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. అళగిరి ప్రత్యేకంగా డీఎంకేను ఓడించడానికి ఏమీ చేయలేదనే చెబుతున్నారు. కానీ... అతడు ఒక్క మాట చెప్పినా కనీసం ఆరుచోట్ల డీఎంకే గెలిచేది. ఈసారి తాను డీఎంకేకు ఓటు వేసే ప్రసక్తి లేదని ఇంతకుముందే అళగిరి స్పష్టం చేశారు. అంతేకాదు, కొన్ని ప్రచారసభల సమయంలో కూడా అసలు ఇక్కడ పార్టీ అభ్యర్థులు ఎలా గెలుస్తారన్న కామెంట్లు కూడా చేసినట్లు వినికిడి.
అంతేకాదు.. ఆయన మద్దతుదారులంతా కలిసి డీఎంకే ఓటమి కోసం కంకణం కట్టుకుని మరీ పనిచేశారట. డీఎంకే బహిష్కృత నేత అయిన అళగిరి.. తాను తన తండ్రి పార్టీ ఓటమి కోసం ఏమీ చేయలేదని.. అసలు తనకు రాజకీయాలంటేనే ఆసక్తి పోయిందని పైకి చెబుతున్నారు. త్వరలోనే అన్నాడీఎంకేలో చేరుతారన్న ప్రచారం కూడా అళగిరి మీద ఉంది. దాంతో ఆయన కావాలనే తండ్రి పార్టీ ఓటమి కోసం తన అనుచరులతో గట్టిగానే పనిచేయించినట్లు చెబుతారు. పార్టీలోను, కుటుంబంలోను గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో పెద్దకొడుకు అళగిరిని కరుణానిధి 1980లలోనే మదురైకి పంపేశారు. అక్కడ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ పార్టీ పత్రిక మురసోలిని నడిపించాలని చెప్పారు. అయినా.. పార్టీ పగ్గాలు చేపట్టాలన్న కోరిక, తండ్రి తర్వాత సీఎం అవ్వాలన్న ఆకాంక్ష అళగిరిని ఆపలేకపోయాయి. దాంతో చివరకు కరుణ.. పార్టీ నుంచే అతడిని బహిష్కరించారు.