tamilnadu election results
-
కెప్టెన్ దుకాణం ఇక బంద్!
అనుకున్నంతా జరిగింది.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయ్యింది. నిన్నమొన్నటి వరకు 28 మంది ఎమ్మెల్యేలకు బాస్‌గా వ్యవహరించిన కెప్టెన్ విజయకాంత్.. ఇప్పుడు పూర్తిగా దుకాణం కట్టేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పార్టీ డీఎండీకే ఎన్నికల సంఘంలో గుర్తింపును కోల్పోయింది. ఏదైనా పార్టీకి గుర్తింపు ఉండాలంటే అది పోటీ చేసిన ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి. కానీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేని డీఎండీకే.. కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే పొందింది. దాంతో రాష్ట్ర పార్టీగా ఇన్నాళ్లూ ఎన్నికల సంఘం వద్ద ఉన్న గుర్తింపును కూడా డీఎండీకే కోల్పోయింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా కెప్టెన్ ససేమిరా అన్నారు. తాను కింగ్ అవుతాను తప్ప కింగ్‌మేకర్‌గా కూడా ఉండే ప్రసక్తి లేదని ఆయన మొండిపట్టు పట్టారు. అందుకే సొంత కుంపటి పెట్టుకుని పోటీ చేశారు. చివరకు తాను డిపాజిట్ సైతం కోల్పోయి దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
కెప్టెన్ ఎలా ఓడాడంటే..!
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా తానే కింగ్ అన్నాడు. కింగ్ మేకర్ అయ్యే సమస్యే లేదన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తాను మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప.. వేరేవాళ్లను కానివ్వబోనంటూ డీఎంకేతో కూడా పొత్తుకు నై అన్నాడు. చివరకు ఒక్క స్థానంలో కూడా గెలవలేక చతికిలబడ్డాడు.. అతడే కెప్టెన్ విజయకాంత్. దాదాపు ప్రతి పార్టీ ఆయన పార్టీ అయిన డీఎండీకేతో పొత్తు పెట్టుకోవాలని భావించాయి. కానీ, ఇప్పుడు చూస్తే తాను పోటీ చేసిన చోట డిపాజిట్ కూడా కోల్పోయాడు. కెప్టెన్ పోటీ చేసిన ఉళుందర్పట్టై స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి విజయం సాధించగా, డీఎంకే అభ్యర్థి రెండోస్థానంలో ఉన్నారు. కెప్టెన్ ఓడిన విషయం తెలియగానే ట్విట్టర్ రకరకాల జోకులతో మోతెక్కిపోయిది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న డీఎండీకే 41 స్థానాలు గెలవడంతో పాటు రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జయతో కలిసి అధికారం పంచుకున్నా.. ఏడాది తర్వాత బయటకు వచ్చేశాడు. పాలధరలు, బస్సు చార్జీలు పెంచినందుకు తనకు కోపం వచ్చిందని, అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశానని అన్నాడు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకేలతో కలిసి ప్రజాసంక్షేమ కూటమి పేరుతో సొంత కుంపటి పెట్టుకుని సీఎం అవుదామని కలలుగన్నాడు. కానీ, ఒకవైపు అన్నాడీఎంకే ప్రభంజనం, మరోవైపు డీఎంకే కూడా 98 సీట్లు సాధించడంతో కెప్టెన్ పార్టీకి, ఆయన కూటమికి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకుండా పోయాయి. -
నాటి ల్యాప్‌టాప్‌లే నేటి ఓట్లయ్యాయి!!
ఐదేళ్ల క్రితం కూడా తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని జయలలిత హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆమె సీఎం అయిన తర్వాత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. అలా తీసుకున్నవాళ్లలో చాలామంది ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి తొలిసారి ఓటుహక్కు పొందారు. సహజంగానే, అమ్మకు ఓట్లు వేసేశారు. అవును.. ఈసారి తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తోసిరాజని జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం వెనుక యువ ఓటర్ల ప్రభావం చాలానే ఉందని చెబుతున్నారు. దానికితోడు ఈసారి కూడా పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు, ప్రతి కుటుంబానికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పడం లాంటివి బాగానే పనిచేశాయి. మరోవైపు ఇప్పటికే అమలుచేస్తున్న అమ్మ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం.. ఇలాంటివి కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద బాగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను చాలా ఆలస్యంగా విడుదల చేసింది. అందులో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు ఇస్తామని, ఉద్యోగాలు చేసుకునే మహిళలు మోపెడ్లు కొనుక్కుంటే వారికి 50% సబ్సిడీ ఇస్తామని, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు 10, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు. అయితే, పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం ఈ ప్రలోభాలకు పెద్దగా లొంగలేదనే చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో డీఎంకే 10 స్థానాలు గెలుచుకుంది. ఇలాంటి చోట్ల ఉచిత హామీలు పనిచేయడం కష్టమేనని బ్రాండింగ్ నిపుణుడు డాన్ కవిరాజ్ చెప్పారు. అయితే.. దీర్ఘకాలిక లక్ష్యాల కంటే ఇలాంటి ఉచిత హామీల వల్లే ఓట్లు ఎక్కువగా పడతాయని, వీటివల్ల ఓటర్ల అభిప్రాయాలు మారే అవకాశం కచ్చితంగా ఉంటుందని జేఎన్‌యూలో సెంటర్ ఫర్ పొలిటికల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గొడవర్తి అభిప్రాయపడ్డారు. -
అళగిరి దెబ్బ కొట్టాడా?
మదురై.. ఈ ప్రాంతం అంతా కరుణానిధి పెద్దకొడుకు అళగిరికి పెట్టని కోట. అక్కడ ఆయన గీసిందే గీత.. చెప్పిందే వేదం. కానీ అలాంటి మదురై ప్రాంతంలో ఉన్న మొత్తం 10 సీట్లకు గాను డీఎంకే 8 చోట్ల ఓడిపోయింది. ఎందుకిలా జరిగిందని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. అళగిరి ప్రత్యేకంగా డీఎంకేను ఓడించడానికి ఏమీ చేయలేదనే చెబుతున్నారు. కానీ... అతడు ఒక్క మాట చెప్పినా కనీసం ఆరుచోట్ల డీఎంకే గెలిచేది. ఈసారి తాను డీఎంకేకు ఓటు వేసే ప్రసక్తి లేదని ఇంతకుముందే అళగిరి స్పష్టం చేశారు. అంతేకాదు, కొన్ని ప్రచారసభల సమయంలో కూడా అసలు ఇక్కడ పార్టీ అభ్యర్థులు ఎలా గెలుస్తారన్న కామెంట్లు కూడా చేసినట్లు వినికిడి. అంతేకాదు.. ఆయన మద్దతుదారులంతా కలిసి డీఎంకే ఓటమి కోసం కంకణం కట్టుకుని మరీ పనిచేశారట. డీఎంకే బహిష్కృత నేత అయిన అళగిరి.. తాను తన తండ్రి పార్టీ ఓటమి కోసం ఏమీ చేయలేదని.. అసలు తనకు రాజకీయాలంటేనే ఆసక్తి పోయిందని పైకి చెబుతున్నారు. త్వరలోనే అన్నాడీఎంకేలో చేరుతారన్న ప్రచారం కూడా అళగిరి మీద ఉంది. దాంతో ఆయన కావాలనే తండ్రి పార్టీ ఓటమి కోసం తన అనుచరులతో గట్టిగానే పనిచేయించినట్లు చెబుతారు. పార్టీలోను, కుటుంబంలోను గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో పెద్దకొడుకు అళగిరిని కరుణానిధి 1980లలోనే మదురైకి పంపేశారు. అక్కడ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ పార్టీ పత్రిక మురసోలిని నడిపించాలని చెప్పారు. అయినా.. పార్టీ పగ్గాలు చేపట్టాలన్న కోరిక, తండ్రి తర్వాత సీఎం అవ్వాలన్న ఆకాంక్ష అళగిరిని ఆపలేకపోయాయి. దాంతో చివరకు కరుణ.. పార్టీ నుంచే అతడిని బహిష్కరించారు.