కెప్టెన్ ఎలా ఓడాడంటే..!
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా తానే కింగ్ అన్నాడు. కింగ్ మేకర్ అయ్యే సమస్యే లేదన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తాను మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప.. వేరేవాళ్లను కానివ్వబోనంటూ డీఎంకేతో కూడా పొత్తుకు నై అన్నాడు. చివరకు ఒక్క స్థానంలో కూడా గెలవలేక చతికిలబడ్డాడు.. అతడే కెప్టెన్ విజయకాంత్. దాదాపు ప్రతి పార్టీ ఆయన పార్టీ అయిన డీఎండీకేతో పొత్తు పెట్టుకోవాలని భావించాయి. కానీ, ఇప్పుడు చూస్తే తాను పోటీ చేసిన చోట డిపాజిట్ కూడా కోల్పోయాడు. కెప్టెన్ పోటీ చేసిన ఉళుందర్‌పట్టై స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి విజయం సాధించగా, డీఎంకే అభ్యర్థి రెండోస్థానంలో ఉన్నారు.
కెప్టెన్ ఓడిన విషయం తెలియగానే ట్విట్టర్ రకరకాల జోకులతో మోతెక్కిపోయిది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న డీఎండీకే 41 స్థానాలు గెలవడంతో పాటు రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జయతో కలిసి అధికారం పంచుకున్నా.. ఏడాది తర్వాత బయటకు వచ్చేశాడు. పాలధరలు, బస్సు చార్జీలు పెంచినందుకు తనకు కోపం వచ్చిందని, అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశానని అన్నాడు.
ఆ తర్వాత సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకేలతో కలిసి ప్రజాసంక్షేమ కూటమి పేరుతో సొంత కుంపటి పెట్టుకుని సీఎం అవుదామని కలలుగన్నాడు. కానీ, ఒకవైపు అన్నాడీఎంకే ప్రభంజనం, మరోవైపు డీఎంకే కూడా 98 సీట్లు సాధించడంతో కెప్టెన్ పార్టీకి, ఆయన కూటమికి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకుండా పోయాయి.