captain vijaykanth
-
హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు
తమిళ సీనియర్ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని కూడా పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్వీట్ చేశాడు. ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రజనీ పేర్కొన్నాడు. என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன். — Rajinikanth (@rajinikanth) June 21, 2022 -
కెప్టెన్ దుకాణం ఇక బంద్!
అనుకున్నంతా జరిగింది.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయ్యింది. నిన్నమొన్నటి వరకు 28 మంది ఎమ్మెల్యేలకు బాస్‌గా వ్యవహరించిన కెప్టెన్ విజయకాంత్.. ఇప్పుడు పూర్తిగా దుకాణం కట్టేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పార్టీ డీఎండీకే ఎన్నికల సంఘంలో గుర్తింపును కోల్పోయింది. ఏదైనా పార్టీకి గుర్తింపు ఉండాలంటే అది పోటీ చేసిన ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి. కానీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేని డీఎండీకే.. కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే పొందింది. దాంతో రాష్ట్ర పార్టీగా ఇన్నాళ్లూ ఎన్నికల సంఘం వద్ద ఉన్న గుర్తింపును కూడా డీఎండీకే కోల్పోయింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా కెప్టెన్ ససేమిరా అన్నారు. తాను కింగ్ అవుతాను తప్ప కింగ్‌మేకర్‌గా కూడా ఉండే ప్రసక్తి లేదని ఆయన మొండిపట్టు పట్టారు. అందుకే సొంత కుంపటి పెట్టుకుని పోటీ చేశారు. చివరకు తాను డిపాజిట్ సైతం కోల్పోయి దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
కెప్టెన్ ఎలా ఓడాడంటే..!
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా తానే కింగ్ అన్నాడు. కింగ్ మేకర్ అయ్యే సమస్యే లేదన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తాను మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప.. వేరేవాళ్లను కానివ్వబోనంటూ డీఎంకేతో కూడా పొత్తుకు నై అన్నాడు. చివరకు ఒక్క స్థానంలో కూడా గెలవలేక చతికిలబడ్డాడు.. అతడే కెప్టెన్ విజయకాంత్. దాదాపు ప్రతి పార్టీ ఆయన పార్టీ అయిన డీఎండీకేతో పొత్తు పెట్టుకోవాలని భావించాయి. కానీ, ఇప్పుడు చూస్తే తాను పోటీ చేసిన చోట డిపాజిట్ కూడా కోల్పోయాడు. కెప్టెన్ పోటీ చేసిన ఉళుందర్పట్టై స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి విజయం సాధించగా, డీఎంకే అభ్యర్థి రెండోస్థానంలో ఉన్నారు. కెప్టెన్ ఓడిన విషయం తెలియగానే ట్విట్టర్ రకరకాల జోకులతో మోతెక్కిపోయిది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న డీఎండీకే 41 స్థానాలు గెలవడంతో పాటు రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జయతో కలిసి అధికారం పంచుకున్నా.. ఏడాది తర్వాత బయటకు వచ్చేశాడు. పాలధరలు, బస్సు చార్జీలు పెంచినందుకు తనకు కోపం వచ్చిందని, అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశానని అన్నాడు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకేలతో కలిసి ప్రజాసంక్షేమ కూటమి పేరుతో సొంత కుంపటి పెట్టుకుని సీఎం అవుదామని కలలుగన్నాడు. కానీ, ఒకవైపు అన్నాడీఎంకే ప్రభంజనం, మరోవైపు డీఎంకే కూడా 98 సీట్లు సాధించడంతో కెప్టెన్ పార్టీకి, ఆయన కూటమికి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకుండా పోయాయి. -
మా ఆయన కింగ్ అవుతారు
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్‌కాంత్ భార్య ప్రేమలత దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అధికార అన్నా డీఎంకే, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేలను విమర్శిస్తూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన వాగ్ధాటితో ఓటర్లను ఆకర్షిస్తూ, డీఎండీకే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ప్రేమలత తమ తరపున ప్రచారం చేయాలని డీఎండీకే అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం విజయ్‌కాంత్ కింగ్ అయితే, ప్రేమలత పాత్ర కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన భర్త విజయ్ కాంత్ కింగ్ అవుతారని ప్రేమలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలసి డీఎండీకే పోటీ చేస్తోంది. ఈ కూటమి తరపున విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి గెలుపుకోసం విజయ్ కాంత్, ప్రేమలత వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్‌కాంత్ గెలుపు కోసం ప్రేమలత నిమిషం కూడా వృథా చేయకుండా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు డీఎండీకేనే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలను వ్యతిరేకిస్తున్న ప్రేమలత.. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద తప్పని అంగీకరించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు ప్రజలతో సంబంధాలు లేవని విమర్శించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇక జయలలితపైనా ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఎండలకు పిల్లలు (ప్రజలు) చనిపోతుంటే అమ్మ (జయలలిత) ఏసీలో కూర్చోరని అన్నారు. తన భర్త విజయ్‌కాంత్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన సినిమాల్లో నటిస్తారు కానీ ప్రజల ముందుకాదంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడు మార్పును కోరుకుంటోందని, తమ పార్టీలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. విజయ్‌కాంత్ సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగులు చెబుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కెప్టెన్ ఎవరికో?
చెన్నై: డీఎండీకే ఓటు బ్యాంక్ ఎవరికి దక్కనుందో అన్న చర్చ రాష్ట్రంలో బయలుదేరింది. బీజేపీ వెంట నడిచేనా, లేదా, డీఎంకేతో దోస్తీ కట్టేనా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయకాంత్‌తో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎండీకే ఆవిర్భావంతో తానొక్కడినే అసెంబ్లీలో అడుగు పెట్టినా, తన కంటూ ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్న నేత విజయకాంత్. ఆ ఓటు బ్యాంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేర్పించింది. లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా, తన ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగా ఉండటం విజయకాంత్‌కు ఓ వరం. అదే ఇప్పుడు ఆయన చుట్టూ ప్రధాన పార్టీ డిఎంకే, జాతీయ పార్టీ బీజేపీని తిప్పించుకునేలా చేస్తున్నది. డిఎంకే, కాంగ్రెస్‌ల బంధం మళ్లీ వికసించడంతో, విజయకాంత్ పయనం ఎటో అన్న ప్రశ్న ఓ వైపు ఉన్నా, విజయకాంత్ ఓటు బ్యాంక్ దక్కేది ఎవరికో అన్న చర్చ మరో వైపు తెర మీదకు వచ్చి ఉన్నది. డీఎండీకేను తమ వైపుకు తిప్పుకునేందుకు డీఎంకే ఓ వైపు, బీజేపీ మరో వైపు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా, ఎక్కడా విజయకాంత్ చిక్కడం లేదు. తన రూటే సపరేటు అన్నట్టుగా ముందుకు సాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ఆయన డీఎంకే వెంట వెళ్లొచ్చన్నట్టుగా మెజారిటీ శాతం అభిప్రాయం వ్యక్తం అవుతున్నా, సీఎం కుర్చి ఎక్కాలన్న ఆశతో ఉన్న ఈ కెప్టెన్ చివరి క్షణంలో ఎలా వ్యవహరిస్తారో అన్నది ఆ పార్టీ వర్గాలకే అంతు చిక్కడం లేదు. దీంతో కెప్టన్ ఎటో అన్న ఉత్కంఠ ఆ పార్టీలోనే కాదు, డీఎంకే, బీజేపీ వర్గాల్లోను పెరిగింది. ఇప్పటికే పొత్తు బేరసారాల్లో విసిగి వేసారి ఒంటరి సమరానికి మానసికంగా సిద్ధం అవుతోన్న బీజేపీ, చివరి చాన్స్‌గా విజయకాంత్ వద్దకు మళ్లీ మంతనాల ప్రయత్నంలో పడ్డట్టుంది. ఇందుకు తగ్గట్టుగానే శనివారం తమిళి సై సౌందరరాజన్ విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటి మెట్లు ఎక్కారు. రాజకీయ అంశాలపై చర్చ ఈ సమయంలో సాగినట్టు సమాచారం. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యం నెలకొన్నప్పటికీ, ఇది కుటుంబ కార్యక్రమానికి ఆహ్వానం మాత్రమేనని, పొత్తు యత్నాలు ఢిల్లీ పెద్దలు చూసుకుంటారంటూ తమిళిసై వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే,తన కుమారుడు సుగనాథన్ వివాహానికి హాజరు కావాలంటూ సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధితోపాటు వివిధ పార్టీల నాయకుల్ని తమిళిసై కలుస్తూ, ఆహ్వాన పత్రికలు అందిస్తున్న విషయం తెలిసిందే. -
'కెప్టెన్' యోగ ముద్రలు కేక!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సహా అగ్రనేతలంతా రాజ్‌పథ్ వద్ద యోగముద్రలు ప్రదర్శించారు. తమిళనాడులో కూడా దీన్ని గట్టిగా ప్రమోట్ చేయాలని కొన్ని పార్టీలు భావించాయి. ముఖ్యంగా అలనాటి హీరో కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే యోగా దినోత్సవాన్ని బాగా ఉపయోగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం యోగముద్రలో ఉన్న విజయకాంత్ ఫొటోతో పెద్ద పోస్టర్ కూడా వేయించారు. అయితే అప్పుడే అసలు కథ మొదలైంది. వెండితెర మీద అద్భుతమైన ఫైట్లు చేసే విజయకాంత్.. యోగా దినోత్సవంలో కూడా అందరికీ సూచనలు ఇస్తారని అంతా భావించారు. కానీ, చిన్న చిన్న ముద్రలు చేయడానికి కూడా ఆయన అటూ ఇటూ అందరివైపు చూడటం కనిపించింది. అలాగే ప్రాణాయామం లాంటి చిన్న చిన్నవాటిని కూడా ఆయన సొంతంగా చేయలేకపోయారు. వేరేవాళ్లు యోగముద్రలు ప్రదర్శిస్తుంటే.. వాళ్లవైపు చూసి చేతులు అటూ ఇటూ ఊపడం తప్ప.. పోస్టర్లో చూపించిన యోగాను ఎక్కడా ఆయన ఆచరించి చూపించలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి.