సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 678 సీట్లకుగాను కేవలం 62 సీట్లలో మాత్రమే మహిళలు విజయం సాధించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో 9.30 కోట్ల మంది మహిళలు ఉండగా, వారిలో కేవలం 9 శాతం మంది మాత్రమే మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు. 2013–2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 77 ఉండగా, అంటే 11 శాతం ఉండేదని భారత ఎన్నికల కమిషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.
ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రితంసారి కన్నా ఎక్కువ మందే పోటీ చేసినప్పటికీ తక్కువ మంది గెలవడం గమనార్హం. ఒక్క చత్తీస్‌గఢ్‌లో మాత్రమే గతం కన్నా ఈసారి ఎక్కువ మంది విజయం సాధించారు. మిజోరంలో పది లక్షలకుపైగా కలిగిన జనాభాలో 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం శూన్యం. ప్రజాస్వామ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం కాదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఓ ఎంపీగా గెలవడమని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రితికా కుమార్ వ్యాఖ్యానించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొని ఎన్నికవడమే కాకుండా మళ్లీ పోటీచేసి కూడా విజయం సాధిస్తున్నారని ఆన్నారు.
వరుసగా గత మూడు ఎన్నికల నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువ మందే పోటీ చేస్తున్నప్పటికీ వారు ఎక్కువగా గెలవలేక పోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 2,716 మంది అభ్యర్థులకుగాను 235 మంది మహిళలు పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 108 మంది, 2008 ఎన్నికల్లో 226 మంది మహిళలు పోటీ చేశారు. ఫలితాల్లో మాత్రం వెనకబడుతున్నారు. 2008లో 25 మంది, 2013లో 30 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. ఇక రాజస్థాన్‌లో 2008లో 154 మంది, 2013లో 152 మంది పోటీ చేయగా ఈసారి ఏకంగా 182 మంది పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 25 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మాత్రమే విజయం సాధించారు.
పోటీ చేస్తున్న వారి సంఖ్యలో గెలుస్తున్న వారి సంఖ్యను తీసుకుంటే మగవారికన్నా మహిళలే ఎక్కువ విజయం సాధిస్తున్నారు. రాజస్థాన్‌లో మొత్తం పోటీ చేసిన వారి సంఖ్యలో మహిళల శాతం ఎనిమిది ఉండగా, విజయం సాధించిన వారిలో వారి శాతం 11.5 శాతం ఉండడమే అందుకు ఉదాహరణ. నేషనల్ ఎలక్షన్ వాచ్ అధ్యయనం ప్రకారం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈసారి 12 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. అన్ని పార్టీలకన్నా అతి తక్కువగా తెలంగాణలోని టీఆర్‌ఎస్ పార్టీ 3 శాతం సీట్లనే మహిళలకు ఇచ్చింది. ఇక ఓ మహిళ అధ్యక్షులుగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 9 శాతం టిక్కెట్లను మహిళలకు ఇచ్చింది. వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన మహిళల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది విజయం సాధించారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చర్చకు వస్తున్న సందర్భంగా ఇలాంటి వివరాలు అవసరమని రితికా కుమార్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment