ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు రోజురోజుకీ పెరుగుతున్న కరోనా తీవ్రత పెద్ద పరీక్ష పెడుతోంది. ఓ వైపు పెరుగుతున్న కేసులకు తోడు మరోవైపు అనుకున్న స్థాయిలో ముందుకు సాగని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇటు ఎన్నికల సంఘానికి అటు రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా పరిణమిస్తోంది. గడిచిన పది రోజుల్లోనే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 70 శాతానికి పైగా కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం లేకపోవడం కలవరపెట్టేలా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాలను ఆదేశించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎంతమేర పుంజుకుంటుందన్నది ప్రశ్నగానే మారింది. మరిన్ని రోజులు నిషేధమే!
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఇంతకింతకీ పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ నెల 8న దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4.72 లక్షలు ఉండగా, అదే రోజున రోజువారీ కేసుల సంఖ్య 1.41 లక్షలుగా ఉంది. అయితే క్రమంగా పెరుగుతూ ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 20.18 లక్షల వరకు చేరగా, రోజువారీ కేసులు 3.47 లక్షలకు చేరాయి. ఇక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క యూపీలోనే పది రోజుల కిందటి కేసుల సంఖ్యతో పోలిస్తే కేసులు 11 వేల నుంచి 18వేలకు చేరాయి.
పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృష్ట్యానే బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఈ నెల 15వరకు ఉన్న నిషేధాన్ని ఎన్నికల సంఘం 22 వరకు పొడిగించింది. 22 తర్వాత సైతం దీనిపై షరతులతో కూడిన సభలకు అనుమతించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ పంజాబ్‌లో 79 శాతం, మణిపూర్‌లో 58 శాతం మాత్రమే పూర్తయింది.
యూపీలో రెండో విడత వ్యాక్సినేషన్ 56.40 శాతమే పూర్తవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని ఈసీ సూచించింది. అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా లేకపోవడం, మరణాల రేటు తక్కువగా ఉండటం కొంత ఉపశమనం ఇస్తోంది. బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఓటర్లను చేరుకునేందుకు నానాయాతన పడుతున్న పార్టీలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ప్రచారాలు మొదలుపెట్టాయి. డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేస్తున్నప్పటికీ ఏ ప్లాట్‌ఫారంలో లేని ఓటర్లను చేరుకోవడం అన్ని పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment