
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఓటమి చవిచూస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ ఓటమి ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థల పరిరక్షణకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, బాలనర్సింహతో కలసి రాజా మీడియాతో మాట్లాడారు.
బీజేపీ అధికారంలో కొనసాగితే వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడి ఫాసిజానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి సంక్లిష్ట, సంక్షోభ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీలు, వివిధ విపక్ష, ప్రాంతీయపార్టీలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుంజుకుంటోందని, బీజేపీని ఓడించకపోతే ఫెడరల్ వ్యవస్థకే ముప్పు అని పేర్కొన్నారు. రైతులు తమ సుదీర్ఘ పోరాటంతో మూడు వ్యవసాయ నల్లచట్టాలను ఉపసంహరింపచేసి మోదీ ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలబెట్టారన్నారు.
బ్యాంక్ ఉద్యోగులు, కార్మికులు, పేదలు, వివిధ వర్గాల ఆందోళనలతో బీజేపీ ప్రభుత్వం, ఆరెస్సెస్ వ్యతిరేక పోరాట సంవత్సరంగా 2022 నిలవబోతోందన్నారు. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతావైఫల్యానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగభృతి, ఉద్యోగ కల్పన వంటి హామీల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని చాడ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment