'అందుకే బీజేపీ ఆ ఒక్క సీటు గెలిచింది'
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల యూడీఎఫ్‌ను కేరళ ఓటర్లు తిరస్కరించారు. కేరళ అభివృద్ధికి ఎల్‌డీఎఫ్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు ఆదరించారు.
కాంగ్రెస్ ఓట్లు కొన్ని బీజేపీకి బదిలీ అవ్వడం వల్ల ఒక సీటు గెలిచింది. పశ్చిమ బెంగాల్‌లో మా పార్టీ వైఫల్యంపై విశ్లేషించుకుంటాం. తమిళనాడులో డబ్బు కీలక పాత్ర పోషించింది. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశాయి. అస్సాంలో మరో సెక్యులర్ ప్రత్యామ్నాయం లేక బీజేపీ గెలిచింది. 15 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది’ అని ఏచూరి పేర్కొన్నారు.