'బడ్జెట్ ఆపించండి.. కుదరదు.. మేం పెడతాం'
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై దుమారం మొదలైంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే బడ్జెట్ వాయిదా వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గురువారం చీఫ్ ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాది పార్టీ, బీఎస్పీ, ఆర్జేడీ పార్టీ నేతలు కలిశారు. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడం సరికాదని సీఈసీకి చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ వాయిదా వేయించాలని కోరారు.
ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాలని కోరారు. మరోపక్క, బడ్జెట్ అనేది రాజ్యాంగ ప్రక్రియలో భాగం అని, బడ్జెట్ పెట్టి తీరుతామని కేంద్రం అంటోంది. విపక్షాలవి పసలేని వాదనలని కొట్టిపారేస్తోంది. అయితే, కేంద్రం వాదనతో శివసేన పార్టీ విబేధించింది. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడం సరికాదని చెప్పింది. వెంటనే కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేయాలని శివసేన పార్టీ నేత సంజయ్ దత్ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న విషయం తెలిసిందే.
కాగా, 2012లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత మార్చి మధ్యలో ప్రవేశపెట్టారు. అయితే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం 2014లో కూడా ఎన్నికలకు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆపుతారా అని అన్నారు. విపక్షాలు డిమాండ్ మేరకు సీఈసీ ఏవిధంగా స్పందిస్తారని తెలియాల్సి ఉంది.