ఎన్నికల ఎఫెక్ట్: బడ్జెట్ వాయిదాపై ఈసీ చర్యలు
న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ఎన్నికల సంఘం స్పందించింది. ప్రాథమిక చర్యగా ‘విపక్షాల అభ్యర్థనపై మీ స్పందన తెలపండి..’ అంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి శనివారం లేఖరాసింది. ఒకవేళ ఎన్నికలకు ముందే బడ్జెట్ నిర్వహిస్తే, ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు పథకాలను ప్రకటించే అవకాశాలు ఉంటాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. మార్చి 8(ఎన్నికల ప్రక్రియ తర్వాతే) బడ్జెట్ ప్రవేశపెట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఈసీని అభ్యర్థించిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. (చదవండి: 'బడ్జెట్ ఆపించండి.. కుదరదు.. మేం పెడతాం')
ఐదు రాష్ట్రాల(ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) అసెంబ్లీలకు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు ఎన్నికలు నిర్వహించేలా ఈసీ జనవరి 4న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. (మోగిన నగారా) అయితే నోటిఫికేషన్ ను పరిగణలోకి తీసుకోకుండా ముందుగా అనుకున్నట్లే ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. మరోవైపు ఇదే అంశంపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను ‘అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు’ అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. (బడ్జెట్ ఆపే పిల్‌పై అర్జెంట్ లేదన్న సుప్రీం) నేటి ఈసీ లేఖకు మోదీ సర్కార్ స్పందన వెలువడాల్సిఉంది.