మరో 10 రోజుల్లో కేంద్ర బడ్జెట్ మన ముందుకొస్తోంది. ప్రతిసారీ బడ్జెట్ అనగానే వివిధ వస్తువుల రేట్లు పెరుగుతాయో; తగ్గుతాయో అనే ఆందోళనలతో పాటు... సామాన్యుల ఉత్కంఠంతా ఆదాయపు పన్ను గురించే. 2018లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2019లో లోక్‌సభతో పాటు మరో మూడు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో ఈ బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో ఏ తరహా చర్యలు ఆశిస్తున్నారన్న దానిపై వివిధ రంగాల నిపుణుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలే ఇవి...
బీమాపై జీఎస్టీ తగ్గించాలి
‘‘బీమా సంస్థలు పాలసీలపై జీఎస్టీ రేటు తగ్గించాలని కోరుతున్నాయి. జీఎస్టీకి ముందు 15 శాతం సేవా పన్ను ఉండేది. జీఎస్టీలో చేర్చిన తర్వాత పన్నును 18 శాతం చేయడంతో బీమా ఉత్పత్తులు ఖరీదుగా మారిపోయాయి. కనీసం జీవితానికి బీమా రక్షణనిచ్చే అసలైన ప్రొటెక్షన్ పాలసీలు (టర్మ్), వైద్య బీమా పాలసీలనయినా కనీస సేవలుగా పరిగణించి వాటి వరకు పూర్తిగా పన్ను మినహాయించాలి’’ అని పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆశిష్ శ్రీవాస్తవ కోరారు. - ఆశిష్ శ్రీవాస్తవ
విరాళాలు, బహమతులకూ ప్రోత్సాహం
‘‘పన్ను చట్టాలను సవరించడం ద్వారా లిస్టెడ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని పన్ను లేకుండా విరాళాలు, బహుమతులుగా ఇచ్చేలా అనుమతించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్యూరిటీలను విరాళంగా, బహుమతిగా ఇవ్వాలనుకుంటే వాటిని విక్రయించి ఆ నగదును బదిలీ చేయాలి. కానీ, ఈ ప్రక్రియ వల్ల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీనికి బదులు వీటిని బదిలీ చేసిన రోజు ఉన్న పారదర్శకమైన మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుంది.
దీనివల్ల దానం చేసేవారికి రెండు ప్రయోజనాలున్నాయి. సెక్యూరిటీలపై మూలధన లాభాల పన్ను మినహాయింపు లభిస్తుంది. తమ ఆదాయం నుంచి ఈ మేర పన్ను మినహాయింపూ పొందొచ్చు’’ అని క్లియర్ ఫండ్స్ సీఈవో కునాల్ బజాజ్ సూచించారు. దీనివల్ల పన్ను పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేందుకు ప్రోత్సహించినట్టు అవుతుందన్నారు. -కునాల్ బజాజ్
విద్యా రుణంపై మినహాయింపులు
‘‘విద్యా రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకుంటే సెక్షన్ 80ఈ కింద వడ్డీ చెల్లింపులకు ఆదాయపన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఈ ప్రయోజనం ఎనిమిది ఆర్థిక సంవత్సరాలకే వర్తిస్తుంది. 2006లో ఈ మినహాయింపు ప్రవేశపెట్టిన సమయంలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్స్‌కు రూ.3–4 లక్షలు, వైద్య డిగ్రీకి రూ.5–6 లక్షలు ఖర్చయ్యేది. కానీ, ఈ రోజు ఇంజనీరింగ్‌కు రూ.8–9 లక్షలు పెట్టాల్సి వస్తోంది.
వైద్య విద్యకు రూ.12–14 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎంబీఏ కోర్సు వ్యయం రూ.25 లక్షలవుతోంది’’ అని మనీమంత్రా ఎండీ రాజ్‌ఖోస్లా గుర్తు చేశారు. రూ.25 లక్షల రుణం, ఎనిమిదేళ్ల కాలానికి తీసుకుంటే ఈఎంఐ రూ.40,000 అవుతుంది. కానీ, సామాన్యులు నెలనెలా ఇంత ఈఎంఐ చెల్లించలేరు కనుక వారు మరింత కాలానికి రుణం తీసుకుంటారని, కనుక పూర్తి కాలానికి పన్ను మినహాయింపు ఉండాలని ఖోస్లా సూచించారు. - రాజ్‌ఖోస్లా
స్వయం ఉపాధికీ ఎన్‌పీఎస్ ప్రోత్సాహకం
స్వయం ఉపాధిలో ఉన్న వారికీ జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో చేసే పెట్టుబడులకు ఉద్యోగుల మాదిరిగా ప్రోత్సాహకాలివ్వాలన్నది మరో సూచన. వాస్తవానికి స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై పన్ను మినహాయింపులున్నప్పటికీ స్థూల ఆదాయంలో 20 శాతం వరకే, అదీ సెక్షన్ 80సీసీఈ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంది. అదే వేతన జీవులైతే ఆదాయంలో 10 శాతం వరకూ సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు.
దీనికి అదనంగా సదరు ఉద్యోగి తాలూకు సంస్థ ఎన్‌పీఎస్‌లో చేసే జమలకు వేతనంలో 10 శాతం వరకు సెక్షన్ 80సీసీడీ(2) కింద మినహాయింపులున్నాయి. స్వయం ఉపాధిలో ఉన్న వారికీ వేతన జీవుల మాదిరే పరిమితిని పెంచాలన్నది నిపుణుల సూచన. సెక్షన్ 80సీసీఈ కింద పరిమితిని రూ.5 లక్షలు లేదా స్థూల ఆదాయంలో 20 శాతం చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల స్వయం ఉపాధిలో ఉన్నవారు ఎన్‌పీఎస్‌లో మరింత ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించినట్టు అవుతుందనేది వారి మాట.
డివిడెండ్‌పై పన్ను రద్దు చేయాలి
‘‘డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ) అనేది కంపెనీలు వాటాదారులకు డివిడెండ్ చెల్లించకుండా నిరుత్సాహపరుస్తోంది. దీంతో ఇన్వెస్టర్ల నమ్మకం దెబ్బతింటోంది. అందుకే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచేందుకు డీడీటీని తొలగించాలి’’ అని నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కె.సురేష్ సూచించారు. -కె.సురేష్
పెన్షన్ పథకాలకూ పన్ను మినహాయింపు!!.
‘‘ఆర్‌బీఐ నివేదిక ప్రకారం చూస్తే... దేశంలో కేవలం కొద్ది మంది మాత్రమే ప్రైవేటు పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అధిక సంఖ్యలో జనాభాకు రిటైర్మెంట్ సమయంలో తగినంత ఆర్థిక రక్షణ ఉండటం లేదు. పెన్షన్ పథకాలపై పన్ను ఇందుకో కారణం. పెన్షన్ ప్లాన్ కాల వ్యవధి ముగిశాక యాన్యుటీ పథకాన్ని తీసుకోకపోతే అప్పటి వరకు ఉన్న నిధిలో 66 శాతంపై పన్ను పడుతుంది. అంతేకాదు, యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే పెన్షన్ ఆదాయానికీ పన్ను మినహాయింపు లేదు.
ఈ రెండు నిబంధనలనూ సరళీకరించి పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేలా జనాన్ని ప్రోత్సహించాలి’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్‌పీఎస్‌పై పన్నును సైతం సమీక్షించాలి. 60 ఏళ్లపుడు 60 శాతాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉండగా, ఇందులో 20 శాతానికే పన్ను మినహాయింపు ఉంది. మిగిలిన 40 శాతంపై పన్ను చెల్లించాలి. ఎన్‌పీఎస్‌లో ప్రజలు చేరాలని ప్రభుత్వం కోరుకుంటే ఈ నిబంధనలను సమీక్షించాల్సిందే’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ దివ్యబవేజా చెప్పారు. -దివ్యబవేజా
టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రత్యేక ప్రయోజనం
‘‘టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది జీవిత బీమా కవరేజీనిచ్చే అతి చౌక సాధనం. కానీ, చాలా మంది దీన్ని డబ్బులు వృ«థా కింద పరిగణిస్తుంటారు. సెక్షన్ 80సీ కింద పరిమితిలో భాగంగా కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రత్యేకంగా పన్ను మినహాయింపు కల్పించడం వల్ల చాలా మందిని ఈ పథకాల కొనుగోలుకు ప్రోత్సహించినట్టు అవుతుంది’’ అని బ్యాంక్‌బజార్ సీఈవో అదిల్‌శెట్టి సూచించారు.
మెడికల్ అలవెన్స్‌పై పరిమితి పెంపు
‘‘వైద్య ద్రవ్యోల్బణం ఏటేటా 18–20 స్థాయిలో పెరుగుతోంది. దీంతో వైద్య వ్యయాలు మెడికల్ అలవెన్స్ పరిమితయిన రూ.15,000 కంటే ఎక్కువే అవుతున్నాయి. సాధారణంగా కంపెనీలు కూడా పన్ను మినహాయింపు ఉన్న రూ.15,000 వరకే మెడికల్ అలవెన్స్‌ను పరిమితం చేస్తున్నాయి. ఈ పరిమితిని సవరిస్తే గనుక కంపెనీలు సైతం అలవెన్స్‌ను పెంచేందుకు ప్రోత్సహించినట్టు అవుతుంది’’ అని టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ సందీప్ పటేల్ సూచించారు.
సెక్షన్ 80సీలో ఇతర పథకాలకూ చోటు...
‘‘ఇటీవలి కాలంలో ఈక్విటీలు అద్భుతమైన రాబడులనిస్తున్నాయి. కానీ, రిస్క్ తీసుకునేందుకు అందరూ సిద్ధంగా లేరు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు సెక్షన్ 80సీ కింద ప్రయోజనాల కోసం ఇప్పటికీ చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఎఫ్‌డీలనే ఆశ్రయిస్తున్నారు. వీటిపై రేట్లు బాగా తగ్గిపోయినందున... పన్ను ఆదా కలిగిన, తక్కువ రిస్క్ ఉండి, మెరుగైన రాబడులివ్వగల ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. సంప్రదాయ, తొలిసారి ఇన్వెస్టర్లకు హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మంచి ప్రత్యామ్నాయం.
సంప్రదాయ పథకాలతో పోలిస్తే ఇవి అధిక రాబడులనిచ్చే అవకాశముంది. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే తక్కువ అస్థిరతలు ఉంటాయి’’ అని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధిక గుప్తా చెప్పారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు హైబ్రిడ్ ఫండ్స్‌కు కూడా విస్తరింపజేయాలని, ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో మాదిరిగా మూడేళ్ల లాకిన్‌తో ఇది చేయవచ్చని ఆమె సూచించారు. -రాధిక గుప్తా
ఇంటి బీమాను తప్పనిసరి చేయాలి
‘ఇంటి బీమాను తప్పనిసరి చేయాలి. దీనికి చెల్లించే ప్రీమియానికి ఆదాయçపుపన్ను మినహాయింపు కల్పించాలి. దీనివల్ల ఇంటికి ఏదైనా జరిగితే ఆర్థికంగా నష్టపోకుండా నివారించడంతోపాటు, బీమా వ్యాప్తిని సైతం పెంచుతుంది’ అని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ కృష్ణమూర్తి అన్నారు. -కేజీ కృష్ణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment