బడ్జెట్ ను వాయిదా వేయండి!
లక్నో: ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో యూనియన్ బడ్జెట్ ను నిలిపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సరి కాదన్నారు. వెంటనే నిలుపుదల చేయాలన్నారు. ఎన్నికల తరువాతే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఆయన మోదీని కోరారు.
దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభావితమ్యే అవకాశం ఉందని తన లేఖలోఅభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్- ఆర్థిక బడ్జెట్ కలిపి పెడుతున్నందువల్ల సంక్షేమ పథకాలను, లాభాలను కోల్పోనున్నారనీ, ఇది రాష్ట్రంలోని 20 కోట్ల జనాభాపై ప్రత్యక్షంగా ప్రభావితం చేయనుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి-మార్చి 2012 లో అప్పటి ప్రభుత్వంఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు బడ్జెట్ వాయిదా వేయడానికి సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకుందని అఖిలేష్ గుర్తు చేశారు.
వచ్చేనెల11 నుంచి మార్చి 8వ తేదీ వరకు యూపీలో ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 30 న ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాలుగో వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టనున్నారు. దీంతో అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి.
కాగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టిన కొద్దిరోజులకే ఓటింగ్ ప్రారంభం కానున్నందున అయిదు రాష్ట్రాల ఓటర్లు ప్రభావితం చేసే ఎలాంటి ప్రకటనలు ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అటు అడ్వకేట్ ఎంఎల్ శర్మ బడ్జెట్ ప్రవేశంపై ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో వేశారు. దీనిపై స్పందించిన సుప్రీం బడ్జెట్ ను వాయిదా వేయాల్సి అవసరం లేదని స్పఫ్టం చేసిన సంగతి తెలిసిందే.