అఖిలేశ్‌జీ.. గాడిదలంటే భయమా!
గుజరాత్ గాడిదలను చూసి ఎందుకు జంకుతున్నారు
► అవి నమ్మకమైనవి.. యజమాని కోసం కష్టపడి పనిచేస్తాయి
► గాడిదలపై యూపీఏ స్టాంపు విడుదల చేసిందని తెలుసుకోండి
► అఖిలేశ్ ‘గాడిద’వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ప్రధాని మోదీ
బహ్రయిచ్ (యూపీ): ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్‌యాదవ్ గుజరాత్‌లోని గాడిదలను చూసి కూడా భయపడిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. గాడిదలు నమ్మకమైన జంతువులని, యజమాని కోసం అవి కష్టపడి పనిచేస్తాయని చెప్పారు. గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయొద్దు అంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ను ఉద్దేశించి అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ తనదైన శైలిలో తిప్పికొ ట్టారు. అఖిలేశ్ విమర్శలు ఆయన జాత్యహం కార మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ‘‘అఖిలేశ్‌జీ.. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమే. మీరు మోదీని, బీజేపీని విమర్శిస్తే నేను అర్థం చేసుకోగలను. కానీ గాడిదలపై విమర్శలు చేస్తున్నారు. అంటే మీకు గాడిదలంటే భయమా? అయినా ఈ గాడిదలు మీకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కదా..’’అని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గురువారం యూపీలోని బహ్రయిచ్‌లో బీజేపీ విజయ్ శంఖనాథ్ ర్యాలీలో మోదీ పాల్గొన్నా రు. ఈ దేశంలోని ప్రజలు తనకు గురువులని, తాను గాడిదల నుంచి స్ఫూర్తిపొందుతానని, ఎందుకంటే తాను రాత్రి.. పగలు ప్రజల కోసం పనిచేస్తున్నానని, గాడిదలు కూడా తమ యజమానికి నమ్మకంగా పనిచేస్తాయని చెప్పారు. జంతువుల విషయంలో కూడా ఎస్‌పీ వివక్షాపూరిత రాజకీయాలు స్పష్టమవు తున్నాయని, గాడిదలు చెడ్డవని వారు భావిస్తున్నారని, ఎందుకం టే వారి ప్రభుత్వం కనిపించకుండా పోయిన గేదెలను వెతికే పనిలో ఉందని, అందువల్ల ఎస్‌పీ ప్రభుత్వానికి గాడిదలు చెడుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. మంత్రి అజంఖాన్ కు చెందిన గేదెలు కనపడకుండాపోతే పోలీసులు వాటిని వెతికి పట్టుకోవడాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ గాడిదలను మీరు ద్వేషించవచ్చని, కానీ మహాత్మా గాంధీ, దయానంద సరస్వతి గుజరాత్‌లోనే పుట్టారని, శ్రీకృష్ణుడు కూడా గుజరాత్‌లోనే బస చేసారనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గుజరాత్ గాడిదలపై గతంలో పోస్టల్ స్టాంపును విడుదల చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్–ఎస్‌పీ పొత్తుపై మోదీ స్పందిస్తూ.. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆ పార్టీలకు ఎటువంటి ఆలోచనలు లేవన్నారు. తన కుటుంబంలోని పెద్దలంతా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అఖిలేశ్ ఇటీవలే ఒక ఇంటర్వూ్యలో చెప్పారని, కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే ఎస్‌పీని కాపాడుకోవచ్చని ఆయన భావిస్తున్నారని, అయితే కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, ఇప్పుడు వారితో పాటు మునిగిపోయేందుకు అఖిలేశ్ కూడా వెళుతున్నారన్నారు.