బెంగళూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరులో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్రశాఖ కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో రెండు నెలలుగా రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం పై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొంటున్న ఐఏఎస్ అధికారులను తరుచూ బదిలీలు చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం 135 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కరువు నివారణ పనులు సాగడం లేదు. దీంతో తాగునీటితో పాటు పశువుల మేతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని రాష్ట్ర హోంశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విపక్ష భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా అందులో భాగంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఎస్.ఎం.ఎస్‌ల ద్వారా ప్రభుత్వలోపాలను ప్రజలకు తెలియజెప్పాడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ జరిగిన పారిశ్రామిక అభివృద్ధి., గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవసాయాభివృద్ధి, ప్రస్తుతం ఆ రంగంలో ఏర్పడిన తిరోగమనం... ఇలా ప్రతి విశయాన్ని గణాంకాల రూపంలో బల్క్ ఎస్.ఎం.ఎస్ రూపంలో పంపించాలని నిర్ణయించింది.
ఇక ఫేస్‌బుక్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న శాంతిభద్రతల సమస్యలు, అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఉంచాలని కమలనాథులు నిర్ణయించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రలు ముగిసిన తర్వాత ఈ నూతన ఘట్టానికి తెరలేపనున్నట్లు బీజేపీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
సర్కారు వైఫల్యాలపై ఆన్‌లైన్ యుద్ధం
Published Mon, Sep 7 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement