బ్లాక్ పేపర్‌ను విడుదల చేస్తున్న ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసింది. మోదీ పాలనా కాలంలో ప్రజలకు వాటిల్లిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని, మహిళలపై నేరాలు పెరిగాయని పేర్కొంది.
పెద్ద నోట్లను రద్దు చేయడం అతిపెద్ద తప్పు అని స్పష్టం చేసింది. ఈ బ్లాక్ పేపర్‌కు ‘10 సంవత్సరాల అన్యాయ కాలం’గా పేరుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వైట్ పేపర్‌కు పోటీగా ఈ బ్లాక్ పేపర్‌ను కాంగ్రెస్ తీసుకొచి్చంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 54 పేజీల ఈ బ్లాక్ పేపర్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘చార్జిషీట్’గా అభివరి్ణంచారు. గత పదేళ్ల కాలమంతా అన్యాయ కాలమేనని విమర్శించారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు.
పార్లమెంట్‌లో ఎన్నో మాటలు చెప్పే ప్రధానమంత్రి వైఫల్యాలను మాత్రం నిస్సిగ్గుగా దాచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత గురించి తాము మాట్లాడితే దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అందుకే సర్కారు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బ్లాక్ పేపర్ తీసుకొచ్చామన్నారు. ఉత్తరం, దక్షిణం పేరిట దేశాన్ని విచి్ఛన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మోదీ చేసిన విమర్శలపై ఖర్గే స్పందించారు. గతంలో మాట్లాడిన మాటలను అబద్ధాలకోరులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ పన్ను హక్కులు అంటూ మాట్లాడారని గుర్తుచేశారు.
దళితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు
తనను దూషిస్తూ కొన్నిరోజులుగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖర్గే తెలిపారు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, దళితుడినైన తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల గురించి తాము నిలదీసినప్పుడల్లా ప్రధాని మోదీ.. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిపై వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఆయా రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, పైగా నిధులిస్తే ఖర్చు చేయడం లేదంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో మోదీ ప్రభుత్వం లూటీకి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈ సొమ్మును వాడుకుంటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకున్నారని, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment