Black paper
-
‘బ్లాక్ అండ్ వైట్’ నిజాలు!
సందిగ్ధతకు తావు లేకుండా విషయం తేటతెల్లమయ్యే స్థితివుంటే, తప్పొప్పులు స్పష్టంగా అర్థమవు తుంటే... అలాంటి పరిస్థితిని వ్యక్తీకరించటానికి ఆంగ్లంలో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే నుడికారాన్ని ఉపయోగిస్తారు. గురువారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం (వైట్ పేపర్) విడుదల చేయగా, దీనికి పోటీగా కాంగ్రెస్ నల్లపత్రం (బ్లాక్ పేపర్) ప్రకటించింది. ఇది ఎన్నికల రుతువు గనుక అధికారంలోకొచ్చి పదేళ్లవుతున్న సందర్భంలో ఆర్థిక రంగంలో తమ ఘనతను చాటుతూ ఎన్డీయే సర్కారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఈ పదేళ్లూ ‘కర్తవ్య కాలమ’ని ఆ పత్రం అభివర్ణించింది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా ఆర్థికరంగంలో ఎంతటి అరాచకత్వం, ఎలాంటి విచ్చలవిడితనం చోటుచేసుకున్నాయో వివరించింది. 2004లో యూపీఏ అధికారంలోకి రావడానికి ముందున్న ఎన్డీయే సర్కారు దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను అందించివెళ్తే యూపీఏ దాన్ని కాస్తా ధ్వంసం చేసిందన్నది శ్వేతపత్రం ఆరోపణ. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్ ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఏకరువు పెట్టింది. ఈ కాలాన్ని ‘అన్యాయ కాలం’గా అభివర్ణించించింది. అందులో ఆర్థిక రంగంతోపాటు ఇతరేతర అంశాలను కూడా ప్రస్తావించింది. రెండూ ఒకేరోజు విడుదల కావటంవల్ల వాస్తవ స్థితి ఏమిటో ‘బ్లాక్ అండ్ వైట్’లో తేటతెల్లమవుతుందని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు యూపీఏ ఉనికిలో లేదు. దాని స్థానంలో ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి రంగంలోకొచ్చింది. గతంలో యూపీఏకు నేతృత్వం వహించినట్టే ఇప్పుడు ‘ఇండియా’కు తానే అన్నీ అయి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. అయినా శ్వేతపత్రానికి కూటమి తరఫున కాక ఆ పార్టీయే సమాధానం ఇవ్వాల్సివచ్చింది. ఉన్న స్థితిగతులను గణాంక సహితంగా చెప్పటానికి విడుదల చేసే పత్రాన్ని శ్వేతపత్రం(వైట్ పేపర్) అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన దానికి పోటీగా బ్లాక్ పేపర్ పేరిట కాంగ్రెస్ ఎందుకు విడుదల చేయాలనుకుందో తెలియదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నింద తొలగించుకోవటానికీ, బీజేపీ ‘నమ్మకద్రోహాన్ని’ చాటడానికీ 1993 మొదట్లో అప్పటి పీవీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాన్ని పూర్వపక్షం చేస్తూ, జరిగిన తప్పిదాలకు కేంద్రానిదే బాధ్యతని వివరిస్తూ బీజేపీ సైతం శ్వేతపత్రాన్నే ప్రకటించింది. ఒకటి మాత్రం వాస్తవం... పత్రాలకు ఏ పేర్లున్నా వాటిల్లో వుండేవి గణాంకాలే. సామాన్యుల బతు కులు చూస్తే తప్ప వాస్తవ స్థితిగతులేమిటో అర్థంకావు. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గురించి శ్వేతపత్రం ఘనంగానే చెప్పింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎన్డీయేది అదే మాట. తమ అయిదేళ్ల పాలన పరమాద్భుతంగా ఉన్నదంటూ ‘భారత్ వెలిగిపోతోంది’ అనే నినాదంతో నాటి ఎన్డీయే 2004 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రజలు తిరస్కరించారు. తాజా శ్వేతపత్రం మాత్రం నాటి ఎన్డీయే సర్కారు సుదృఢమైన ఆర్థిక వ్యవ స్థను అప్పగించిందని చెబుతోంది. దాని మాటెలావున్నా యూపీఏ తొలి అయిదేళ్ల పాలన ఒడిదుడు కులు లేకుండానే గడిచిందని చెప్పాలి. రెండోసారి నెగ్గాక అతి విశ్వాసమో, ఎదురులేదన్న దురహంకారమో యూపీఏను దెబ్బతీశాయి. పార్టీలోనూ, వెలుపలా ప్రత్యర్థులను అణచివేసేందుకు అప్రజా స్వామిక విధానాలు అమలయ్యాయి.శ్వేతపత్రం ప్రస్తావించిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం తదితర 15 స్కాములలో అధికభాగం రెండో దశ పాలనలోనివే. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు తన ఘనతేనని చెప్పుకుని కూడా వాజ్‌పేయి సర్కారు అందించిన అవకాశాలను వినియోగించుకోలేని చేతగాని స్థితిలో యూపీఏ పడిందన్నది శ్వేతపత్రం ప్రధాన ఆరోపణ. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా చేతివృత్తులు దెబ్బ తిని, వ్యవసాయం గిట్టు బాటు కాక, కొత్తగా ఏర్పడిన ఉపాధి అవకాశాలను అందుకోలేక భిన్న వర్గాలు పడిన యాతనలు అన్నీ ఇన్నీ కాదు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గీతం ఈ దీనస్థితికి అద్దం పట్టింది. సంస్కరణలు మాన వీయ దృక్పథంతో వుండాలన్న ఆలోచన ఆ తర్వాత వచ్చిందే. అనుత్పాదక ప్రయోజనాలకు వ్యయం చేయటంతో 2003–04లో 31 శాతంగా వున్న పెట్టుబడి వ్యయం 2013–14 నాటికి 16 శాతానికి దిగజారిందని శ్వేతపత్రం అంటోంది. అయితే 2008–09లో ప్రకటించిన రూ. 52,000 కోట్ల రుణమాఫీని ఈ జాబితాలో చేర్చటం సరికాదు. సాగురంగానికి జవసత్వాలివ్వటానికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకోవటానికీ ఆ చర్య దోహదపడింది. సగటు ద్రవ్యోల్బణ శాతం 8నుంచి 5కు తీసుకురావటం, తలసరి జీడీపీలో వృద్ధి, పెట్టుబడి వ్యయం పెరుగుదల, పరోక్ష పన్ను రేటులో తగ్గుదల వంటివి తమ విజయాలుగా శ్వేతపత్రం తెలిపింది. అయితే నల్లధనాన్ని వెలికి తీయటానికంటూ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ప్రస్తావన ఇందులో లేదు. యూపీఏ కాలంనాటి అవ్యవస్థనూ, దాని చేతగానితనాన్నీ గణాంక సహితంగా చెప్పకపోవటంవల్ల అప్పటి పరిస్థితులపై కాంగ్రెస్ స్వోత్కర్షలకు పోతోందని ఏనాటినుంచో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వుంది. తాజా శ్వేతపత్రం ఆ లోటైతే తీర్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఈఅంశాలు బీజేపీకి ఆయుధాలవుతాయి. అటు కాంగ్రెస్ అప్పట్లో తాము సాధించిందేమిటో చెబుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాక, జనం మౌలిక సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలు కావటం ఎప్పుడూ మంచిదే. -
PM Narendra Modi: మాకది దిష్టి చుక్క!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి చుక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు, ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన ‘దిష్టి చుక్క’గా భావించవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి వీడ్కోలుపై గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. దారిచూపే దీపం మన్మోహన్ సింగ్ దేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు దేశ ప్రజలకు అందించిన సహకారం, చేసిన మార్గదర్శకత్వం ఎప్పటికీ గుర్తుంటుంది. మన్మోహన్ వంటి విశిష్ట వ్యక్తులు దారి చూపే దీపం లాంటివారు. ఆయన నడవడిక నుండి సభ్యులంతా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’’ అని సూచించారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఓ బిల్లుపై ఓటు వేసేందుకు మన్మోహన్æ చక్రాల కుర్చీలో వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాధ్యతగా నిర్వహించారో చెప్పడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ చర్చ జరిగినా మన్మోహన్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే’’ అని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్‌కు దీర్ఘాయుస్సు కలగాలని, ఆయన ఆరోగ్యప్రదమైన జీవనం సాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న ఇతర సభ్యులు పార్లమెంట్లో నేర్చుకున్న అంశాలను దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని బలోపేతం చేయడానికి ఉపయోగించాలని కోరారు. రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3న ముగియనుంది. -
Mallikarjun Kharge: ‘పదేళ్ల అన్యాయ కాలం’
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసింది. మోదీ పాలనా కాలంలో ప్రజలకు వాటిల్లిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని, మహిళలపై నేరాలు పెరిగాయని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం అతిపెద్ద తప్పు అని స్పష్టం చేసింది. ఈ బ్లాక్ పేపర్‌కు ‘10 సంవత్సరాల అన్యాయ కాలం’గా పేరుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వైట్ పేపర్‌కు పోటీగా ఈ బ్లాక్ పేపర్‌ను కాంగ్రెస్ తీసుకొచి్చంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 54 పేజీల ఈ బ్లాక్ పేపర్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘చార్జిషీట్’గా అభివరి్ణంచారు. గత పదేళ్ల కాలమంతా అన్యాయ కాలమేనని విమర్శించారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో ఎన్నో మాటలు చెప్పే ప్రధానమంత్రి వైఫల్యాలను మాత్రం నిస్సిగ్గుగా దాచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత గురించి తాము మాట్లాడితే దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అందుకే సర్కారు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బ్లాక్ పేపర్ తీసుకొచ్చామన్నారు. ఉత్తరం, దక్షిణం పేరిట దేశాన్ని విచి్ఛన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మోదీ చేసిన విమర్శలపై ఖర్గే స్పందించారు. గతంలో మాట్లాడిన మాటలను అబద్ధాలకోరులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ పన్ను హక్కులు అంటూ మాట్లాడారని గుర్తుచేశారు. దళితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు తనను దూషిస్తూ కొన్నిరోజులుగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖర్గే తెలిపారు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, దళితుడినైన తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల గురించి తాము నిలదీసినప్పుడల్లా ప్రధాని మోదీ.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిపై వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఆయా రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, పైగా నిధులిస్తే ఖర్చు చేయడం లేదంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో మోదీ ప్రభుత్వం లూటీకి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈ సొమ్మును వాడుకుంటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకున్నారని, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని ఆక్షేపించారు. -
నల్ల కాగితం.. రూ.500 అవుతుందట!
ఓ ముఠా ఆటకట్టించిన ఖాకీలు మార్కాపురం : ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారిని నిలువునా మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు సీఐ శివరామకృష్ణారెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన త్రిపురాంతకం మండలం దూపాడుకు చెందిన కె.జాన్ అలియాస్ జయానందపాల్ వద్దకు అదే గ్రామానికి చెందిన జె.జాన్ ఇశ్రాయేల్, ఎనిబెర జాన్‌లు వచ్చి తమకు రూ.50 వేల అసలు నోట్లు ఇస్తే వాటికి తమ వద్ద ఉన్న నోట్లను కలిపి లిక్విడ్‌లో ముంచితే రూ.2 లక్షలు అవుతాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్న నల్ల కాగితాల (500 రూపాయల నోట్ సైజు గల కాగితాలు)ను ఓ లిక్విడ్‌లో ముంచి తీస్తే రూ.500 నోట్‌గా మారుతుందని చెప్పారు. అంతేకాకుండా ప్రయోగాత్మకంగా ముందే సిద్ధం చేసుకున్న ఒక ప్లేట్లో అసలు రూ.500 నోటును దాచి ఉంచి (జయానందపాల్‌కు తెలియకుండా) నల్లని కాగితాన్ని లిక్విడ్‌లో ముంచి బయటకు తీశారు. అది రూ.500 నోట్‌గా మారటంతో జయానందపాల్‌కు అత్యాశ పుట్టింది. ఆ వెంటనే రూ. 50 వేల అసలు నోట్లు ఇచ్చాడు. వారు ఇచ్చిన నల్ల కాగితాలను లిక్విడ్‌లో ముంచి చూడగా రూ.500 నోట్లుగా మారకపోవటంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్దారవీడు ఎస్సై సురేష్ తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో బోడిరెడ్డిపల్లె జంక్షన్లో సంచరిస్తున్న ఎనిబెర జాన్, జె.జాన్ఇశ్రాయేలును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా వారు నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 10 వేల నగదు, నల్ల కాగితాలు, లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అత్యాశతో మోసపోవద్దని సీఐ సూచించారు. మార్కాపురం ప్రాంతంలో అసలు నోట్లు తీసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఎవరైనా చెబితే తమకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు ఉన్నారు.