నల్ల కాగితం.. రూ.500 అవుతుందట!
ఓ ముఠా ఆటకట్టించిన ఖాకీలు
మార్కాపురం : ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారిని నిలువునా మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు సీఐ శివరామకృష్ణారెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన త్రిపురాంతకం మండలం దూపాడుకు చెందిన కె.జాన్ అలియాస్ జయానందపాల్ వద్దకు అదే గ్రామానికి చెందిన జె.జాన్ ఇశ్రాయేల్, ఎనిబెర జాన్‌లు వచ్చి తమకు రూ.50 వేల అసలు నోట్లు ఇస్తే వాటికి తమ వద్ద ఉన్న నోట్లను కలిపి లిక్విడ్‌లో ముంచితే రూ.2 లక్షలు అవుతాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్న నల్ల కాగితాల (500 రూపాయల నోట్ సైజు గల కాగితాలు)ను ఓ లిక్విడ్‌లో ముంచి తీస్తే రూ.500 నోట్‌గా మారుతుందని చెప్పారు.
అంతేకాకుండా ప్రయోగాత్మకంగా ముందే సిద్ధం చేసుకున్న ఒక ప్లేట్‌లో అసలు రూ.500 నోటును దాచి ఉంచి (జయానందపాల్‌కు తెలియకుండా) నల్లని కాగితాన్ని లిక్విడ్‌లో ముంచి బయటకు తీశారు. అది రూ.500 నోట్‌గా మారటంతో జయానందపాల్‌కు అత్యాశ పుట్టింది. ఆ వెంటనే రూ. 50 వేల అసలు నోట్లు ఇచ్చాడు. వారు ఇచ్చిన నల్ల కాగితాలను లిక్విడ్‌లో ముంచి చూడగా రూ.500 నోట్లుగా మారకపోవటంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్దారవీడు ఎస్సై సురేష్ తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో బోడిరెడ్డిపల్లె జంక్షన్‌లో సంచరిస్తున్న ఎనిబెర జాన్, జె.జాన్‌ఇశ్రాయేలును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా వారు నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 10 వేల నగదు, నల్ల కాగితాలు, లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అత్యాశతో మోసపోవద్దని సీఐ సూచించారు. మార్కాపురం ప్రాంతంలో అసలు నోట్లు తీసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఎవరైనా చెబితే తమకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు ఉన్నారు.