సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి చుక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు.
ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు, ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన ‘దిష్టి చుక్క’గా భావించవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి వీడ్కోలుపై గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు.
దారిచూపే దీపం మన్మోహన్ సింగ్
దేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు దేశ ప్రజలకు అందించిన సహకారం, చేసిన మార్గదర్శకత్వం ఎప్పటికీ గుర్తుంటుంది. మన్మోహన్ వంటి విశిష్ట వ్యక్తులు దారి చూపే దీపం లాంటివారు. ఆయన నడవడిక నుండి సభ్యులంతా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’’ అని సూచించారు.
కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఓ బిల్లుపై ఓటు వేసేందుకు మన్మోహన్æ చక్రాల కుర్చీలో వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాధ్యతగా నిర్వహించారో చెప్పడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ చర్చ జరిగినా మన్మోహన్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే’’ అని ప్రశంసించారు.
మన్మోహన్ సింగ్‌కు దీర్ఘాయుస్సు కలగాలని, ఆయన ఆరోగ్యప్రదమైన జీవనం సాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న ఇతర సభ్యులు పార్లమెంట్‌లో నేర్చుకున్న అంశాలను దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని బలోపేతం చేయడానికి ఉపయోగించాలని కోరారు. రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3న ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment