న్యూఢిల్లీ: నీట్ వివాదం, మణిపూర్ హింసపై చర్చ జరపాలంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రం తరపున ఆయన సమాధానమిచ్చారు.
మణిపూర్ అంశంలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాధారణ స్థితిని తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. మణిపూర్‌లో హింస తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు.
చిన్న రాష్ట్రంలో 11 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని.. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారని తెలిపారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్‌లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్‌లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
‘మణిపూర్‌లో కాంగ్రెస్ సుదీర్ఘ పాలనను ప్రస్తావిస్తూ.. మణిపూర్ చరిత్ర తెలిసిన వారికి మణిపూర్‌లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని తెలుస్తుంది. ఈ సామాజిక సంఘర్షణ మూలం చాలా లోతైనదని ఎవరూ కాదనలేరు. ఇంత చిన్న రాష్ట్రంలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు మర్చిపోకూడదు.
ఈ తరహా హింస 1993లో జరిగిందన్నారు. ఐదేళ్లపాటు ఇలాంటి ఘటనలు నిరంతరం జరిగాయన్నారు. మణిపూర్‌ను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. అక్కడి ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారు’. అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment