బాధ్యత మరచి ఎదురుదాడా! | Criticism dramas continue in AP govt: TDP govt failures | Sakshi
Sakshi News home page

బాధ్యత మరచి ఎదురుదాడా!

Published Mon, Dec 2 2024 4:46 AM | Last Updated on Mon, Dec 2 2024 4:46 AM

 Criticism dramas continue in AP govt: TDP govt failures

ప్రభుత్వంలో కొనసాగుతూనే విమర్శల డ్రామాలు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా జగన్‌పైనే కూటమి నేతల నెపం

బాబు డైరక్షన్‌లో ఊరూరా పచ్చ నేతలకు బెల్టు షాపులు.. ఇప్పుడు బెల్టు తీస్తామంటూ బాబు బీరాలు  

మిల్లర్లకు సీఎంఆర్‌ బిల్లుల చెల్లింపులో కమీషన్ల దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా 

వలంటీర్లపై వేటు వేసి.. ఇంటివద్దకే పౌర సేవలంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు 

విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చి ఆరు నెలలు తిరగకుండానే జనం నెత్తిన రూ.15,485.36 కోట్ల భారం 

రైతుకు ‘మద్దతు’ లేదు.. వర్షాలకు ధాన్యం తడిచి దయనీయ పరిస్థితి 

అప్పులపై పూటకో మాట.. నోటికొచి్చన లెక్కలు  

యావత్తు అధికార యంత్రాంగం వారిదే..! ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నదీ వాళ్లే.. 

అధికారంలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులూ వారే..! మళ్లీ విమర్శలు చేసేదీ వారే!!  

ప్రభుత్వంలో కొనసాగుతూ వైఫల్యాలకు బాధ్యత వహించాల్సిన వారే బాధ్యతా రాహిత్యంగా ప్రశ్నలు వేస్తుంటారు!!  

తప్పులు చేసేదీ వారే.. తప్పించుకుని తిరిగేదీ వారే!!  

రాష్ట్రంలో డైవర్షన్‌ రాజకీయాలతో రక్తికట్టిస్తున్న కూటమి నేతలు

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా తన వైఫల్యాలను, తప్పిదాలను ఒప్పుకోకుండా వైఎస్సార్‌ సీపీపై బురద చల్లేందుకు ఆపసో­పాలు పడటం సిగ్గుచేటనే విమర్శలు వ్యక్తమవుతు­న్నాయి. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలపై రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోవైపు నిత్యం జగన్‌ జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకే పరిమితమైందని రాజ­కీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇసుక నుంచి మద్యం వరకు.. కాకినాడలో పీడీఎస్‌ బియ్యం నుంచి ధాన్యం రైతులను తుపాన్‌కు వదిలేయడం దాకా అడుగడుగునా కూటమి సర్కారు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

ఇసుకలో లూటీ చేసేదీ వారే..! బెల్టు షాపులకు అనుమతి ఇచ్చేదీ వారే..! బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే.. మళ్లీ స్మగ్లింగ్‌ జరుగుతోందంటూ హడావుడి చేసేదీ వారేనని పేర్కొంటున్నారు. అసలు కాకినాడ పోర్టుకు రేషన్‌ బియ్యం ఎందుకు వస్తోంది? పీడీఎస్‌ బియ్యం వస్తుంటే గత ఆర్నెల్లుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎవరు పంపుతున్నట్లు? కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా? తన పార్టీకి చెందిన మంత్రి పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు. సీఎంఆర్‌ బియ్యం బకాయిల విడుదలలో కమీషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గత సర్కారుపై బురద చల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు. 

ఊరూరా బెల్ట్‌ షాపులు తెరిచి.. బెల్ట్‌ తీస్తామంటారా?
మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు.. టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్‌ షాపులను తెరిపించారు. సీఐ, ఎస్‌ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఊరూరా ఒక్కో బెల్ట్‌ షాపును వేలం వేసి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. రూ.2 లక్షల నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తూ నీకింత.. నాకింత! అని వాటాల దందా నడిపిస్తున్నారు.  బెల్ట్‌ షాపులతో వాడవా­డలా మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బెల్ట్‌ షాపులు పెడితే బెల్ట్‌ తీస్తానంటూ సీఎం చంద్రబాబు బీరాలు పలుకుతుండటంపై ఎక్సైజ్‌శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా హోంమంత్రి అనిత ఇలాకాలో కూడా బెల్టు షాపుల దందా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా!
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం సేకరించిన వరి ధాన్యాన్ని మర ఆడించేందుకు పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్‌ కింద బియ్యాన్ని తిరిగి అప్పగిస్తారు. దీనికి సంబంధించి సుమారు రూ.1,600 కోట్ల వరకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాకినాడ కేంద్రంగా సరి కొత్త డ్రామాకు తెర తీశారు.

స్మగ్లింగ్‌కు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. బియ్యం ఎగుమతి.. ఎరువుల దిగుమతి అంతా యాంకరేజ్‌ పోర్టు మీదుగానే సాగుతుంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకు.. కాకినాడ పోర్టుకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న యాంకరేజ్‌ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుందని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. 

పారదర్శక వ్యవస్థను తొలగించి ఇంటికే పౌరసేవలా?
ప్రభుత్వ సేవలు, పథకాలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను తొలగించి దారుణంగా వంచించారు. వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా ఇంటి గుమ్మం వద్దకే పౌర సేవలు అందిస్తానని చెప్పడంపై విస్తుపోతున్నారు. 

వలంటీర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు లబ్ధిదారులను పెన్షన్ల కోసం ఇళ్ల వద్దకు రప్పించి చుట్టూ తిప్పుకుంటున్నారు. సచివాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్న ఫోటోలు మీడియాలోనూ వచ్చాయి. మరోవైపు కూటమి సర్కారు దాదాపు లక్షన్నర పెన్షన్లను కుదించింది. ఇక పౌరసేవలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామంటూ బాదుడే బాదుడు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చారీలను ఏమాత్రం పెంచబోమని.. వాటిని తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఊరూవాడా ప్రచారం చేశారు. అయితే హామీని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.15,485.36 కోట్ల భారాన్ని విద్యుత్‌ చార్జీల రూపంలో ప్రజలపై మోపారు. విద్యుత్‌ చార్జీల మంటతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెడుతూ సీఎం చంద్రబాబు బురద చల్లుతున్నారు.

ధాన్యం రైతుకు దగా..
ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కూటమి సర్కారు దారుణంగా విఫలమైంది. ఎమ్మెస్పీ దక్కకపోవడంతో అన్నదాతకు బస్తాకు రూ.300 – రూ.400 వరకు నష్టం వాటిల్లింది. దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు తుపాన్‌ కారణంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు రోజులు ముందే తుపాన్‌ హెచ్చరికలున్నా సీఎం చంద్రబాబు అధికారు­లతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు చేపట్ట­లేదు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చోద్యం చూసింది. గోనె సంచులు సమకూర్చలేదు. పంట చేతికందే సమయంలో వర్షాలకు ధాన్యం తడిచిపోవ­డంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

అప్పులపై అవే అబద్ధాలు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. రూ.పది లక్షల కోట్లు.. రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నేతలు, ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌తోపాటు వందల హామీలను ప్రజలకు చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సూపర్‌ సిక్స్‌తోసహా ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పులతోపాటు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌ సాక్షిగా రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. అయినా సరే రాష్ట్రం అప్పు రూ.పది లక్షల కోట్లు కంటే ఎక్కువ ఉందంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తూ.. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉండటం వల్లే హామీలను అమలు చేయలేకపోతున్నానని సమర్థించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

పోలవరానికి ద్రోహం..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. అయితే ఇప్పటికే స్పిల్‌ వేను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మించామని.. పోలవరం ప్రధాన డ్యామ్‌ను కూడా అదే రీతిలో నిర్మిస్తామని.. కావాలంటే టేపు తీసుకుని వచ్చి కొలుచుకోవాలని నాడు సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసరడంతో తోక ముడిచారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని అప్పటి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సైతం పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనేక మార్లు స్పష్టం చేశారు.

కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఆగస్టు 28న పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేయడం గమనార్హం. దీనిపై ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు నోరు మెదపలేదు. పోలవరానికి కూటమి ప్రభుత్వం తలపెట్టిన ద్రోహానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దుష్ఫ్రచారాన్నే సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల ఇప్పుడూ చేస్తుండటం గమనార్హం.

ఇసుకపై ఇష్టారాజ్యంగా.. 
ఇసుక ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలిచ్చారు. వర్షాకాలంలో అవసరాల కోసం గత సర్కారు స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకలో 40 లక్షల టన్నులను అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ నేతలు తెగనమ్మి సొమ్ము చేసుకున్నారు. అందరూ దసరా పండుగ సందడిలో ఉన్న సమయంలో కేవలం రెండు రోజులే గడువు ఇచ్చి ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించారు. ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. ఇసుక ధరలను పచ్చ ముఠాలు ఇష్టారాజ్యంగా వసూలు చేయడంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement