చెంతనే గోదారి.. తీరని దాహార్తి
-
రక్షిత నీటి పథకాల నిర్మాణంలో జాప్యం
-
స్థలం లేకుండానే ఓవర్‌హెడ్ ట్యాంకుకు సీఎం శంకుస్థాపన
-
ఐదు నెలలైనా పరిష్కారం కాని సమస్య
గలగలా పారే గోదారి చెంతనే ఉన్నా రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాలు దాహార్తితో అల్లాడుతున్న దుస్థితి. ప్రణాళికల్లో లోపాలు.. అధికారుల అలక్ష్యంతో చాలా పథకాలు శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. మరికొన్నిటికి ఇతర సమస్యలు అవరోధాలుగా మారుతున్నాయి. ఫలితంగా చెంతనే ఉన్న గోదారి గంగ.. ఇక్కడి ప్రజల గొంతులను తడపలేని పరిస్థితి ఏర్పడుతోంది.
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని ఏడాది పొడవునా గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నా నగరవాసులకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఏటా దాదాపు 3 వేల టీఎంసీల జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. అందులో పిసరంత వాడుకున్నా నగర ప్రజల తాగునీటి సమస్య తీరుతుంది. అయితే ప్రభుత్వ అలక్ష్యం, ఇంజినీరింగ్ అధికారుల అవగాహనా రాహిత్యం నగర ప్రజలకు శాపంగా మారాయి. నగరంలో తలపెట్టిన తాగునీటి సరఫరా పథకాల నిర్మాణం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన పథకాలు కూడా శిలాఫలకాలకే పరిమితమయ్యాయి.
నాలుగేళ్లుగా..
నగరంలో తాగునీటి సమస్యను కొంతవరకైనా పరిష్కరించడానికి వీలుగా 2012లో కోటిలింగాల ఘాట్ వద్ద 10 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం తలపెట్టారు. ఇది ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఇక్కడ నీటిని తోడే ప్రదేశం (ఇన్‌టేక్ పాయింట్) ఎంపికలో ఇంజినీరింగ్ అధికారుల అవగాహనా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు ఎంపిక చేసిన ఇన్‌టేక్ పాయింట్‌లో వరద సీజన్‌లో నీరు పుష్కలంగా ఉంటుంది కానీ వేసవిలో లభించదు. పనులు ప్రారంభించిన తర్వాత ఈ విషయం గుర్తించడంతో నగర పాలక సంస్థ ప్రస్తుత కమిషనర్ ఈ పనులు నిలిపివేయించారు. ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండే ప్రాంతం కోసం అన్వేషిస్తున్నారు. కోటిలింగాల ఘాట్ నుంచి పుష్కరఘాట్ వైపు లా హాస్పిన్ హోటల్ వద్ద ఇన్‌టేక్ పాయింట్ నిర్మించాలని యోచిస్తున్నారు. కోటిలింగాల ఘాట్‌లోని ప్లాంట్ నుంచి ఇక్కడకు సుమారు అర కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ నీటిని తీసుకోవడానికి పైపులు నిర్మించాల్సి ఉంది.
స్థలం లేకుండానే..
నగరంలోని 45, 46, 47, 48, 49 డివిజన్లలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ రోజు విడిచి రోజు నీరు వస్తోంది. ఈ సమస్యను తీర్చేందుకు 48వ డివిజన్ సారంగధర మెట్ట వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించాలని ప్రతిపాదించారు. గత మే నెలలో రూ.2.83 కోట్లతో 15 వేల కిలోలీటర్ల సామర్థ్యంతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ స్థలంలో ట్యాంకు నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. కోటిలింగాల ఘాట్ ప్లాంట్ నుంచి ఇక్కడకు రూ.80 లక్షలతో పైపులైన్లు కూడా వేశారు. అయితే స్థల సమస్యతో ట్యాంక్ నిర్మాణం ముందుకు సాగలేదు. స్థలాన్ని విక్రయించాలన్నా, లీజుకు ఇవ్వాలన్నా హైకోర్టు అనుమతి కావాలని దేవాదాయ శాఖ నిబంధనలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేయడమో లేదా లీజుకు తీసుకోవడమో చేయాలని కార్పొరేషన్ భావిస్తోంది. ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదు నెలలవుతున్నా లీజు ఒప్పందం జరగకపోవడం గమనార్హం. తాజాగా స్థలంపై హక్కును తెలుపుతూ దేవాదాయ శాఖ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. సాధారణంగా స్థలం ఎంపిక జరిగిన తర్వాతే ఏదైనా ప్రాజెక్టు చేపడతారు. కానీ అధికారులు ముందుగా స్థలాన్ని ఎంపిక చేయకపోవడంతో ట్యాంక్ నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఫలితంగా ఐదు డివిజన్ల ప్రజలు తాగునీటికి తిప్పలు పడుతున్నారు.
ఒప్పందం చేసుకోవాల్సి ఉంది
సారంగధర మెట్ట వద్ద దేవాదాయ శాఖ స్థలంలో ట్యాంక్ నిర్మించాలని నిర్ణయించాం. స్థలాన్ని విక్రయించబోమని ఆ శాఖ చెబుతోంది. లీజుకు తీసుకోనున్నాం. ఇందుకు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కోటిలింగాల ఘాట్ 10 ఎంఎల్‌డీ ప్లాంట్ ఇన్‌టేక్ పాయింట్ వద్ద ఎల్లప్పుడూ నీటి లభ్యత ఉండదు. అందుకే లా హాస్పిన్ హోటల్ వద్ద ఇన్‌టేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పదో డివిజన్, 50వ డివిజన్‌లోని గాంధీపురం క్వారీ ఏరియా, సారంగధర మెట్ట వద్ద మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు పూర్తయితే నగరంలో నీటి సమస్య ఉండదు.
– వి.విజయరామరాజు, కమిషనర్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ
కార్పొరేషన్ నుంచి లేఖ వచ్చింది
దేవాదాయ శాఖ స్థలం విక్రయించాలంటే హైకోర్టు అనుమతి కావాలి. అనుమతి వస్తే ఆ భూమికి సమానమైన భూమి ఇవ్వడం లేదా మార్కెట్ విలువ ఆధారంగా నగదు చెల్లించాలి. హైకోర్టు అనుమతితో దీర్ఘకాలిక లీజు ఇస్తాం. సారంగధరమెట్ట వద్ద స్థలాన్ని విక్రయించాలని లేదా లీజుకు ఇవ్వాలని కార్పొరేషన్ లేఖ రాసింది. దీనిని పై అధికారులకు పంపాం. అక్కడ నుంచి సమాధానం రావాల్సి ఉంది.
– డీఎల్‌వీ రమేష్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ