కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే పడవో, పంటో ఎక్కాల్సిందే. మరో దారి లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూ కొవ్వూరు వెళ్లేవారు. కొవ్వూరు నుంచి తిరిగి రావాలన్నా మళ్లీ అదే మార్గం..అదే కష్టం..1976 నుంచి ఈ ఇబ్బందులు తప్పాయి.
ఉభయ గోదావరి జిల్లాలను (విభజనకు ముందు) కలుపుతూ అఖండ గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన ప్రారంభమైంది. కింది మార్గంలో రైలు వెళ్లేందుకు పట్టాలు.. దానిపైన రోడ్డు నిర్మించారు. అపురూపమైన ఈ రవాణా సౌకర్యం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. గోదారమ్మ సాక్షిగా బస్సులోనో.. రైలులోనో గమ్మం చేరే మధురాభూతుల ప్రయాణానికి మార్గం ఏర్పడింది.
మనదేశంలో రెండో అతిపెద్ద రోడ్డు కం రైలు ప్రయాణ వారధి ఇదే. 49 ఏళ్ల ఈ చారిత్రాత్మక వంతెన నాణ్యత పరిరక్షణ ఇప్పుడు సవాలుగా నిలిచింది. వయో భారం పెరగడంతో ఎక్కువ వాహనాలను ఈ వంతెనపై అనుమతించాలాంటే సందేహించాల్సి వస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా భారీ వాహనాలను అనుమతించకూడదని అధికారులు తాజాగా నిర్ణయించారు.
నిర్మాణం ఇలా: గోదారమ్మ వడ్డాణం ధరించిందా అన్నట్టుటుంది రైలు కం రోడ్డు వంతెన. ఈ వంతెనపై ప్రయాణమంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇప్పటికీ బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం వస్తుందనగానే అందరి కళ్లూ ఉరకలేసే గోదారిని చూడాలని ఆరాటపడతాయి.
ఆనందానుభూతులను మనసులో నింపుకొంటారు. చెన్నై–హౌరా మధ్య రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ వారధి నిర్మాణం తెరపైకి వచ్చింది. 1964లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక దశాబ్దం పట్టింది. జపాన్‌లో కన్‌సాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 1994లో 3.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన స్కైగేట్ బ్రిడ్జి తర్వాత పెద్ద వంతెన ఇదే కావడం విశేషం.
అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మూడు జాతీయ సంస్థలు ఈ వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. 1974 నవంబర్ 20 అప్పటి రాష్ట్రపతి ప్రకృద్ధీన్ ఆలీ అహ్మద్ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరవై ఐదేళ్లు కనిష్టం, ఎనభై ఏళ్లు గరిష్టంగా మనగలిగేలా వారధిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ వారధి ఉభయ గోదావరి సమైక్య వాహినిగా ఖ్యాతినార్జించింది.
ఇప్పుడేమైంది: నిర్మాణ సమయంలో అనుకున్న అంచనాలకు మించి తర్వాత ఈ వారధిపై రాకపోకలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని అంచనా. రవాణా అవసరాలు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సరకు రవాణాకూ ఈ మార్గాన్నే అనుసరించేవి. ఫలితంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
వారధికి భారంగా పరిణమించింది. దీంతో 49 ఏళ్లకే వంతెన మార్గం ప్రమాదంలో పడింది. 2007, 2011లలో దీనిని నిపుణులు పరిశీలించారు. మూడు ఆక్సిల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు, లేదా 10.20 టన్నుల బరువుకు మించిన వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో అధికారులు వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు.
నిర్లక్ష్యానికి మూల్యం
క్షేత్ర స్థాయిలో వంతెనపై భారీ వాహనాకు సంబంధించిన రూపొందించిన నిషేధాజ్ఞలు సక్రమంగా అమలు కాలేదు. 2010లో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల ఉదాశీన వైఖరిని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఎస్సైతో పాటు దిగువ స్థాయిలోని పదిమంది సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత నిబంధనల అమలుకు వంతెన మార్గానికి అటు ఇటు పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. తర్వాత సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. దీంతో భారీ వాహనాల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది.
అధికారులు ఇటీవల వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇరువైపులా నిషేధాజ్జలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 23 నుంచి భారీ వాçహనాల నియంత్రణపై కలెక్టర్ మాధవీలత గట్టి ఆంక్షలు విధించారు. రెండు వైపులా పోలీసు పికెట్లను పునరుద్ధరించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వంటివి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా పల్లెవెలుగు బస్సులను అనుమతిస్తున్నారు.
రూ.36 కోట్లతో మరమ్మతులు
ఈ వంతెనపై 1996 నుంచి ఇప్పటివరకూ అడపాదడపా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కానీ అవి నిలవడం లేదు. ఇటీవల ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ వంతెన మార్గానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ.24 కోట్ల వ్యయంతో గడ్డర్ల మార్పిడి, పుట్‌ఫాత్ నిర్మాణం, శ్లాబులు వేయడం, హ్యాండ్ రైలింగ్ వంటి పనులు ఇందులో చేపడతారు.
ఈ మొత్తంలో రూ.3 కోట్లు మాత్రమే రైల్వే శాఖ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో జాయింట్ల మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, సెకండరీ జాయింట్ మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు, క్రోకడయిల్ జాయింట్ మరమ్మతులు చేపట్టాలని సంకల్పించారు. అత్యవసరంగా రూ.2.10 కోట్ల వ్యయంతో వారధికి ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్ రోడ్లను కూడా పునరుద్ధరించనున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment