‘స్వచ్ఛత’కు చక్కని చేయూత | swatch godavari rajamahendravaram | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛత’కు చక్కని చేయూత

Published Fri, Jul 28 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

‘స్వచ్ఛత’కు చక్కని చేయూత

‘స్వచ్ఛత’కు చక్కని చేయూత

–ఓఎన్‌జీసీకి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందన
–రాజమహేంద్రవరంలో ‘స్వచ్ఛగోదావరి’కి శ్రీకారం
 -హై పవర్‌ మోటార్లతో ఘాట్ల ప్రక్షాళన
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం సిటీ) : స్వచ్ఛభారత్, స్వచ్ఛరాజమహేంద్రవరం కార్యక్రమాల్లో ఓఎన్‌జీసీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. జూలై 15 నుంచి 31 వరకు జరిగే స్వచ్ఛభారత్‌ పక్షోత్సవాల్లో భాగంగా ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ శుక్రవారం రాజమహేంద్రవరం వద్ద గోదావరిఘాట్‌లను హైపవర్‌ మోటారు ఇంజన్ల సహాయంతో ‘స్వచ్ఛగోదావరి’ పేరుతో ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టింది.స్థానిక పుష్కరఘాట్‌లో కార్యక్రమాన్ని కలెక్టర్‌ మిశ్రా బెలూన్లు, పావురాలను వదిలి ప్రారంభించారు. కలెక్టర్‌తో పాటు నగరపాలకసంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు,  మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆనంద్‌, ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, అసెట్‌ మేనేజర్‌ డీఎంఆర్‌ శేఖర్‌ల సమక్షంలో యంత్రాల డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడానికి ఓఎన్‌జీసీ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం  చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఓఎన్‌జీసీ, ఇతర కార్పొరేట్‌ సంస్థలు  చేయూతనివ్వాలన్నారు. ముందు ఓఎన్‌జీసీ అసెట్‌ మేనేజర్‌ శేఖర్‌ మాట్లాడుతూ ఓఎన్‌జీసీ స్వచ్ఛభారత్‌ మిషన్‌ లక్ష్యాలకు కట్టుబడి ఉందన్నారు. రాజమహేంద్రవరానికి రూ.45 లక్షల విలువైన మెకనైజ్డ్‌ సాలిడ్‌ వేస్ట్‌ రిమూవల్‌ స్క్రీనింగ్‌ సిస్టమ్‌ను, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి రూ.20 లక్షల విలువైన ఫ్లాట్‌డెక్స్‌ కలిగిన ఎస్‌ఎంఎల్‌ ఇసుజు మోడల్‌ స్టార్టప్‌ ట్రక్కులను, పర్యావరణ పరిరక్షణకు రాజమహేంద్రవరం కోటిపల్లిబస్టాండ్‌లో  ఒక బయో టాయిలెట్‌ను నిర్మించి అందజేస్తున్నామన్నారు. నగరంలో ఉన్న పబ్లిక్‌టాయిలెట్లకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అనంతరం పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కేంద్రీయవిద్యాలయ, నగరపాలకసంస్థ పాఠశాలల విద్యార్థుల నృత్యాలు, స్వచ్ఛభారత్‌పై ప్రదర్శించిన నాటికలు అలరించాయి. ఓఎన్‌జీసీ ఉద్యోగసంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉమెన్‌ కమిటీ, ప్రత్యేక రక్షణదళంసభ్యులు, నగరపాలకసంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement