మాచవరం (రాయవరం) : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టడంతోపాటు ఖాళీ బిందెలతో నిరసన తెలపాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఆదివారం మాచవరం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వడదెబ్బకు ప్రజలు మరణిస్తున్నా ఒక్కరికి కూడా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ప్రజల ఇబ్బందులపై తమ ఆందోళనతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచే ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఆందోళనలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న చంద్రబాబు
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తూ పాలన సాగిస్తోందని కన్నబాబు విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారన్నారు. ‘చంద్రబాబూ!త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏది?’ అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఉండదని కేంద్ర మంత్రి చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో నిరశన దీక్ష చేపట్టినప్పుడు ఎద్దేవా చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ప్రజలకు ఏం చెబుతుందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చి ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని సూచించారు.
రైతులు నష్టపోతున్నారు
ప్రజా సమస్యలను పూర్తిగా విమర్శించిన చంద్రబాబునాయుడు రాజకీయాల్లో మునిగి తేలుతున్నారని కన్నబాబు విమర్శించారు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర దక్కక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బొండాలు ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,020కి కొనుగోలు చేయడం లేదన్నారు. తక్షణమే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో నిరసనలు
Published Mon, May 2 2016 12:48 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement