నిమ్స్‌లో నీటి చుక్క కరువాయె! | Water Shortage in NIMS Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో నీటి చుక్క కరువాయె!

Published Tue, May 21 2019 7:46 AM | Last Updated on Sat, May 25 2019 12:24 PM

Water Shortage in NIMS Hospital Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/సోమాజిగూడ:  ప్రతిష్టాత్మాక నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (నిమ్స్‌)లోని రోగులకు  నీటి కష్టాలు తప్పడం లేదు. దాహమేస్తే తాగేందుకే కాదు...సర్జరీ తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరులేక పోవడంతో సోమవారం పలు విభాగాల్లో చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎండాకాలంలో నీటి అవసరాలపై అధికారులు ముందే ఓ అంచనాకు రాలేక పోవడం, సంపుల్లోకి చేరుతున్న నీటిని, వాటి నిల్వలను పరిశీలించక పోవడం, సరఫరా అయిన నీటిని కూడా సద్వినియోగం చేసుకోక పోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం. నీటికోసం ఆస్పత్రి నెలకు రూ. 50 లక్షల చొప్పున ఏడాదికి రూ.ఆరు కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. కానీ రోగుల నిష్పత్తికి తగినంత నీటిని అందించలేక పోతోంది. ఫలితంగా రోగులే బయటి నుంచి బాటిళ్లను కొనుగో లు చేయాల్సి వస్తుంది. ఇలా ఒక ఐదు లీటర్లకు రూ. వంద వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఆశతో వచ్చి..నిరాశతో వెనుతిరిగిన రోగులు
నిజానికి శని, ఆదివారాల్లో రోగుల రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రతి సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. జలమండలి నుంచి వచ్చే నీటి సరఫరా, ట్యాంకుల్లో నిల్వల పరిశీలన, వార్డులకు సరఫరా కోసం ఆస్పత్రిలో ఆరుగురు సిబ్బందిని నియమించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నీటిసంపులోని నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించక పోవడం వల్ల ఆదివారం సాయంత్రం నుంచి కుళాయిల్లో నీటిసరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలియక అప్పటికే సర్జరీలకు ప్లాన్‌ చేసుకున్న వైద్యులు, చికిత్సల కోసం ఉదయం ఐదు గంటలకే ఆపరేషన్‌ థియేటర్ల ముందుకు చేరుకున్నారు. తీరా చికిత్స తర్వాత వైద్య సిబ్బంది చేతులకు శుభ్రం చేసుకునేందుకు నీరు లేదని తెలిసి చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా సర్జికల్‌ ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూ రో సర్జరీ, కార్డియాలజీ, తదితర విభాగాల్లో చిన్నాపెద్ద అన్ని కలిపి 60 సర్జరీల వరకు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సగం మంది వైద్యులు వేసవి సెలవుల్లో ఉన్నారు. నీరులేక ఉన్నవాళ్లు కూడా సర్జరీలు చేయలేని పరిస్థితి నెలకొంది.  

ఉగ్గబట్టుకోవాల్సిందే
ఉస్మానియా, గాంధీ వంటి ఇతర ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్‌ కొంత భిన్నమైంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మాత్రమే కాదు దీనికి చైర్మన్‌గా స్వయంగా సీఎం కొనసాగుతుంటారు. కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోలిస్తే..ఇక్కడ వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం, మెరుగైన వైద్యసేవలు అందుతుండటం, అనేక మంది నిపుణులు అందుబాటులో ఉండటంతో రోగులు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. 1500 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్‌పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున రెండు వేల మందికిపైగా వస్తుంటారు. పదిహేను వందలకుపైగా రోగులు ఇన్‌పేషంట్లు చికిత్సలు పొందతుంటారు. ఒక్కో రోగికి ఒక సహాయ కుడు ఉంటారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు కూడా నీటి సరఫరా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతు న్నాయి. జనరల్‌ వార్డుల్లోనే కాదు పేయింగ్‌ రూమ్‌ల్లోనూ ఇదే దుస్థితి. మూత్రశాలలు కంపుకొడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఉగ్గబట్టుకోవాల్సి వస్తుంది.  ఇదిలా ఉండగా రోగులు, వైద్యులు రోజంతా నీరు లేక ఇబ్బంది పడటంతో అధికారులు మేల్కొని సాయంత్రానికి సమస్యను పరిష్కరించారు. మంగళవారం నుంచి సమస్య రాకుండా చూస్తామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement