నీటి సమస్యకు పరిష్కారం వెలిగొండ
► పశ్చిమ ప్రకాశంలో తాగునీటి సమస్య తీవ్రతరం
► మూడేళ్లుగా ముందుకు సాగని వెలిగొండ ప్రాజెక్టు పనులు
► వచ్చే బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించాలి
► ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
గిద్దలూరు : వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితేనే జిల్లాలో తాగు, సాగు నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు దివంగత ముఖ్యమంత్రి ప్రారంభించిన వెలిగొండను పూర్తి చేయాలని, ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో రూ.1000 కోట్లు మంజూరు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిద్దలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఆ నిధులు పాతబిల్లులకే సరి...: అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లవుతున్నా పనులు ముందుకు కదల్లేదని ఎంపీ వైవీ విమర్శించారు. ఏటా రూ.75కోట్లు, రూ.153కోట్లు, రూ.200కోట్లు చొప్పున నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారని ఆరోపించారు. ఇంత తక్కువ నిధులు కాంట్రాక్టర్ల పాతబిల్లులు చెల్లించేందుకే సరిపోవన్నారు. వరుసగా మూడేళ్ల పాటు కరువు ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నేటికీ ప్రత్యామ్నాయ చర్యలు ఆలోచించకపోవడం దారుణమన్నారు. గిద్దలూరులో గుండ్లమోటు, బైరేనిగుండాల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రకాశంపై వివక్ష తగదు..: కృష్ణా నుంచి జిల్లాకు ఆరు టీఎంసీల సాగర్ జలాలు కేటాయిస్తే ఇందులో నాలుగు టీఎంసీలు రాబట్టుకోలేని దౌర్భాగ్యస్థితి జిల్లాలో ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఆ నీటితో 250 చెరువులు మాత్రమే నింపారని, మరో 120 చెరువులు నింపాల్సి ఉందన్నారు. ఇక నీరు వస్తుందో లేదో తెలియదని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అనంతపురం తర్వాత అత్యంత కరువు జిల్లా ప్రకాశం అని, జిల్లా ప్రజలకు కాపాడుకోవాల్సిన అవసరం టీడీపీకి లేనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేవలం అమరావతి, పట్టిసీమ, పురుషోత్తముని ప్రాజెక్టు అంటూ కొన్నింటిని పట్టుకుని వేలాడుతూ.. ప్రజలను గాలికొదిలేశారని మండి పడ్డారు. జిల్లాపై వివక్షత చూపుతున్నారన్నారు. జిల్లాలో ప్లోరైడ్ ప్రభావితం ఎక్కువగా ఉందని, ఇప్పటి వరకు 420మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారని ఆవేదన చెందారు.
ప్రజల ప్రాణాలతో సర్కారు చెలగాటం..: ఏడాది కాలంగా జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, జనవరి 18న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నారని తెలిసి మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడిగా ప్రకటించిన ప్రభుత్వం రెండు నెలలవుతున్నా ఏర్పాటు కాలేదన్నారు. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రి నడ్డాతో తాను మాట్లాడానని చెప్పారు. జిల్లాలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు తన ఎంపీ నిధుల నుంచి రూ.12లక్షలు కేటాయించానని అయినప్పటికీ ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలపై ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో అంతకు మించిన వ్యతిరేకత టీడీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ముందకురావాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, పార్టీ నాయకులు అభిషేక్‌రెడ్డి, కె.వి.రమణారెడ్డి, యేలం వెంకటేశ్వరరావు, చెన్ను విజయ, జజ్జల ఆనందరావు రెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.