Velugonda Project
-
2023 సెప్టెంబర్‌కు వెలుగొండ పూర్తి
పెద్దదోర్నాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్‌నాటికి పూర్తి చేసి మూడు జిల్లాల ప్రజలకు నీరందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సోమవారం కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న 7,200 కుటుంబాలకు పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును ఆయన కుమారుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. పనులు చేపట్టిన సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులకు చెప్పారు. ఇది ప్రకాశం నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లోని 15 లక్షల మంది ప్రజలకు తాగు నీరు, 4,50,000 ఎకరాలకు సాగు నీరు అందించే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని అన్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 8 వేల కోట్లు అయితే ఇప్పటివరకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ప్రతి ఒక్కరి న్యాయమైన కోరికను నెరవేరుస్తామని తెలిపారు. ప్రాజెక్టు పనులపై ప్రతి నెలా సమీక్షిస్తామన్నారు. సుమారు 1,500 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 11.5 ఎకరాలకు సంబంధించి టీ5 పోర్షన్‌కు రూ.85 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంజూరు చేసి పరిపాలన అనుమతులు ఇచ్చారన్నారు. -
కరువు నేలపై జలసిరి..
ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే.. ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే బీడువారిన నేల తల్లికి జలసిరులందించిన భగీరథునిలా.. కరువు నేలపై హరిత సంతకమయ్యాడు .దగాపడిన బడుగు జీవికి.. లయ తప్పిన పేద గుండెకు ఊపిరిలూదిన దైవంలా నిలిచాడు చదువు ‘కొనలేక’ పేదింటి అక్షరం చిన్నబోతే.. వయసుడిగిన నాడు ఆసరా లేక వృద్ధాప్యం ఉసూరుమంటే ఇంటికి పెద్దకొడుకై ఆపన్న హస్తం అందించాడు. మహానేత దూరమైనా ఆయన ఇచ్చిన అభివృద్ధి ఫలాలు నిత్యం గుర్తుచేస్తూనే ఉన్నాయి నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ రాజశేఖరుని స్మరించుకుంటున్నారు. సాక్షి,ప్రకాశం: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై పుష్కర కాలం కావస్తున్నా జిల్లా ప్రజలు మాత్రం ఆయన జ్ఞాపకాలను గుండెల్లో పదిలం చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుతోంది. గురువారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం.. నిత్యం కరువుతో అల్లాడే జిల్లా రూపు రేఖలు మార్చేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. జిల్లాలో ఆయన ఆలోచనలతో జీవం పోసుకున్న ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.... యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ రూపొందించిందే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టును రూపొందించారు. వైఎస్సార్ అకాల మరణం తరువాత పనులు నిలిచిపోయాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ పనులు వేగం పుంజుకున్నాయి. ►పాలేరు రిజర్వాయర్‌ను కూడా వైఎస్సార్ మంజూరు చేశారు. కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం పాలేరుపై చెన్నుపాడు వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును మధ్యలో టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయటానికి రూ.210 కోట్లతో కొత్తగా వ్యయ అంచనాలను మార్చి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ►జిల్లాలో సాగర్ ఆయకట్టు దాదాపు 4.40 లక్షల ఎకరాల్లో ఉంది. సాగు, తాగునీరు సక్రమంగా వచ్చేందుకు కాలువల మరమ్మతులు ఏళ్ల తరబడి చేపట్టకపోవటంతో సాగర్ నుంచి రావాల్సిన వాటా నీటిని కూడా వినియోగించుకునే పనిలేకుండా పోయింది. దీంతో అప్పట్లో రూ.400 కోట్లు ఖర్చు చేసి సాగర్ కాలువల అభివృద్ధిని చేపట్టారు. ► జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేకపోవటాన్ని గుర్తించిన వైఎస్సార్ జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్ మెడికల్ కళాశాలను మంజూరు చేయించారు. మెడికల్ కాలేజి నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు చేశారు. ► కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను తీర్చేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజీ(ఎస్ఎస్) ట్యాంకును మంజూరు చేశారు. సాగర్ నీటితో రామతీర్థం జలాశయాన్ని నింపి తద్వారా కందుకూరు ఎస్ఎస్ ట్యాంకుకు తాగునీటిని సరఫరా చేయించేందుకు పూనుకున్నారు. ► రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని రాళ్లపాడుకు మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధికి పూనుకున్నారు. ► ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడిపోతున్న కనిగిరి ప్రాంత ప్రజల తాగునీటి అవస్థలు తీర్చేందుకు రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ► వీటితో పాటు మార్కాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు జిల్లాలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటానికి వైఎస్సార్ 2004 నుంచే పూనుకున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలోని 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. అదేవిధంగా 15.25 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లు మార్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి నీరు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గమనించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలో 84 వేల ఎకరాలకు సాగు నీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. -
ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారిస్తాం: వైవీ
ప్రకాశం: జిల్లాలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఏడవ రోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రకాశం జిల్లా గుండెకాయ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని వారం రోజుల క్రితం పాదయాత్ర చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా కాకర్ల వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన సభలో వైవీ ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అసైన్డ్ భూముల పేరుతో రైతులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు గ్రామాల ప్రజా సమస్యలు ముందుగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్సీపీ నేత ఆదిశేషగిరి రావు సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జలకళ అని చంద్రబాబు అనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే బాబు కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని కరవు కమ్మేసిందని, ఫ్లోరిన్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు కాకమ్మ కథలు చెబుతున్నారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని వెల్లడించారు. తాజాగా సంక్రాంతికి నీళ్లు ఇస్తానని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. ‘ నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యం. పాత కాంట్రాక్టర్లను తొలగించి చంద్రబాబు తన బినామీలను పెట్టుకున్నాడు. చంద్రబాబూ అబద్ధాలు మాని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి. నామీద చౌకబారు ఆరోపణలు మానుకో.నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ, చంద్రబాబు బినామీ. నలభై ఏళ్ల అనుభవంతో చంద్రబాబు కడుతున్న రాజధాని నేడు ముగిపోతుంది. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు మానుకుంటా. ఎవరితోనైనా బాబు కాపురం చేయగలడు. కాంగ్రెస్‌తో, టీడీపీ కలవడంలో ఆశ్చర్యం లేదు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడ’ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
సంక్రాంతికి నీళ్లు.. మోసం చేయడమే
ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒంగోలు వైఎస్సార్సీసీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కొన్నిరోజులుగా వైవీ, పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా పాదయాత్రలో మాట్లాడుతూ..ఏపీలోని 13 జిల్లాల్లో అత్యంత వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లాయేనని, ప్రకాశం జిల్లా ఎప్పుడూ కరువు కాటకాలతో విజయతాండవం ఆడుతుందని వ్యాఖ్యానించారు. నాలుగు నెలల్లో 3.5 కిలోమీటర్ల సొరంగం పూర్తి అవుతుందా అని సీఎం చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. సంక్రాంతికి నీళ్లు ఇస్తానని చెప్పడం ప్రజలను బాబు మోసం చేయడమేనని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు బాగుంటేనే రాష్ర్టం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
తటాకాలను తలపిస్తున్న సొరంగ నిర్మాణ ప్రాంతాలు
పెద్దదోర్నాల: మండల పరిధి కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ పనులకు సంబంధించి రెండో సొరంగ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున నీరు చేరడంతో ఆ ప్రాంతం తటాకాన్ని తలిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షంతో పాటు సొరంగ మార్గం ద్వారా వచ్చే ఊట నీరు భారీగా చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సాధారణంగా సొరంగ మార్గాల నుంచి వచ్చే ఊట నీటిని పనులు జరిగే ప్రాంతం నుంచి బయటకు తరలించేందుకు ప్రత్యేకంగా పంపింగ్ వ్యవస్థను రూపొందించారు. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా పేరుకు పోయాయన్న కారణంతో విధ్యుత్ శాఖాధికారులు గత నెల 24వ తేదీన ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపేశారు. గుత్తేదారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసి మోటార్లతో నీరు తోడే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, నిర్వహణలో అధిక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో జనరేటర్లను రెండు విడతలుగా వినియోగించి నీరు తోడే పనులు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జనరేటర్లను పొదుపుగా వినియోగిస్తుండటంతో సొరంగ నిర్మాణ ప్రాంతంలో తరుచూ నీరు నిలబడి మడుగును తలపిస్తోంది. -
గుర్తు తెలియని వ్యక్తి హత్య
పెద్దదోర్నాల: గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనముక్కల సమీపం వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ వద్ద సోమవారం వెలుగు చూసింది. హత్య ఆదివారం రాత్రి జరిగినట్లు భావిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు పెట్రోలు పోసి నిప్పటించడంతో ముఖం పూర్తిగా గుర్తించలేని స్థితిలో ఉంది. తీగలేరు కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, సీఐ మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఆనవాళ్లు సేకరించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మృతుడికి 35 నుంచి 40 ఏళ్లు ఉండొచ్చు. మృతుడు నల్ల రంగు ప్యాంట్‌తో పాటు తెలుపు, ఇటుక రంగు చిన్న గళ్ల షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడిని ఎక్కడైనా చంపి ఇక్కడికి తెచ్చి పడవేశారా, లేక ఇక్కడే హతమార్చి తగులబెట్టారా.. అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతుడి ఆనవాళ్లని గుర్తించి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్యరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. సంఘటన స్థలంలో స్థానికంగా ఉన్న ఓ మద్యం షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌తో పాటు, రెండు అగ్గిపెట్టెలను ఎస్ఐ రామకోటయ్య స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి మృతదేహం కాలువలో పడేశారన్న వార్త దావానలంలా వ్యాపించడంలో మండల కేంద్రంతో పాటు సమీప గ్రామాలైన ఐనముక్కల, యడవల్లి గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. -
చంద్రబాబు గతాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు..
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదట్నుంచీ చెబుతోందని ఆపార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగ్ తన నివేదికలో పట్టిసీమలో అవినీతి జరిగిందని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. కానీ, కాగ్ చెప్పినంత మాత్రాన విచారణ జరిపించలేమని చంద్రబాబు చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరిని మరోసారి స్పష్టం చేసిందని ఎమ్మెల్యే సురేష్ ఎద్దేవా చేశారు. 2జీ, బొగ్గు కుంభకోణం కేసుల్లో కాగ్ చెప్తేనే సీబీఐ విచారణ జరిగిందన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల పచ్చపార్టీ... కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లను మారుస్తున్నారనీ.. వాటి అంచనా వ్యయాల్ని ఇష్టారీతిన పెంచుతున్నారని సురేష్ ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు వ్యయం రూ.495 కోట్ల నుంచి 1012 కోట్లకు పెంచారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి రూ.2844 కోట్లు అవసరం కాగా కేవలం 334 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు సింహభాగం నిధుల కేటాయింపులు జరిగాయని అన్నారు. -
పరిహారమా..పరిహాసమా?
► పునరావాస కల్పనలోనిర్లక్ష్యం ► పూర్తిస్థాయిలో అందని పరిహారం ► తొమ్మిదేళ్లుగా కాలయాపన ► ప్రారంభం కాని పునరావాస పనులు ► శిథిలమైన గృహాల్లో ముంపు గ్రామాలవాసుల అవస్థలు వారి త్యాగం వెల కట్టలేనిది... తాత, ముత్తాతల నుంచి పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరును, చెరగని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్వగ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం మాత్రం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొండల మధ్య పచ్చని చెట్ల నడుమ ఉండే ఆ గ్రామస్తులు లక్షల మంది ప్రజల కోసం ఊరిని వదిలేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండించే పొలాలను కూడా వదులుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం వారి పునరావాసం పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. కొత్త ఇళ్లు నిర్మించుకుందామంటే ఉపయోగం లేదు. పోనీ ఉన్న ఇంటికి మరమ్మతులు చేయించుకుందామన్నా ఎప్పుడు ఖాళీ చేయిస్తారో తెలియదు. దీంతో శిథిల గృహాల మధ్య నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లింపు, ఆర్ఆర్ ప్యాకేజి అమలులో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుమారు 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మార్కాపురం మండలంలో గొట్టిపడియ, అక్కచెరువు తండా, పెద్దారవీడు మండలంలో సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, అర్ధవీడు మండలంలోని కాకర్ల, మాగుటూరు తండా, తదితర గ్రామాలు ఉన్నాయి. మొత్తం 11 గ్రామాల్లో 11,365 గృహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 4 వేల గృహాలు శిథిలావస్థకు చేరాయి. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు ఒక్క పునరావాస కాలనీ ప్రారంభం కాలేదు. కనీసం ఒక్క గృహం కూడా శంకుస్థాపనకు నోచుకోలేదు. వర్షాకాలంలో మబ్బులు పడితే వారి గుండెల్లో భయం. డ్యామ్‌లోకి నీళ్లు వస్తే మునిగిపోతామన్న ఆందోళన. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ డ్యామ్ ముంపు గ్రామమైన గొట్టిపడియ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. సుమారు తొమ్మిదేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల స్థలాల సేకరణ పూర్తి కాలేదు. గొట్టిపడియ పంచాయతీలో గొట్టిపడియ, అక్కచెరువు తండా ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారు 950 కుటుంబాలు, 650 గృహాలు ఉన్నాయి. వీరిలో దాదాపు 60 కుటుంబాల వారికి నష్టపరిహారం అందలేదు. 20 ఎకరాలకు సంబంధించి 10 మంది రైతులకు నష్టపరిహార పంపిణీ ఇంకా జరగలేదు. పెద్దారవీడు మండలంలోని చింతలముడిపిలో 56 గృహాలు, 72 కుటుంబాలు, సుంకేసులలో 1131 గృహాలు, 1552 కుటుంబాలు, కలనూతలలో 514 గృహాలు, 625 కుటుంబాలు, గుండంచర్లలో 237 గృహాలు, 715 కుటుంబాలు ఉన్నాయి. గొట్టిపడియ డ్యామ్ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు, సుంకేశుల డ్యామ్ పరిధిలో చింతలముడిపి, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలు మునిగిపోనున్నాయి. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాల వారికి మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న అల్లూరి పోలేరమ్మ దేవాలయం వద్ద 60 ఎకరాల్లో కొంత మందికి, కోమటికుంట వద్ద 45 ఎకరాల్లో మరి కొంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, భూములు కోల్పోతున్న రైతులు కోర్టుకు వెళ్లటంతో తొమ్మిదేళ్ల నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదు. సుంకేసుల గ్రామస్తులకు తోకపల్లె వద్ద, కలనూతల గ్రామస్తులకు ఇడుపూరు వద్ద , గుండంచర్ల గ్రామస్తులకు దేవరాజుగట్టు వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి ఏడేళ్లు కావస్తోంది. కొంత మందికి ఇంకా నష్టపరిహారం చెల్లించకపోవటంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్ 1, 2, 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు. ఇదిలా ఉండగా, గొట్టిపడియ లింక్ కాలువ నిర్మాణంలో కూడా 15 ఎకరాలకు రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించకపోవటంతో అటు భూమిని కోల్పోయి, ఇటు నష్టపరిహారం రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో పాటు కాలువకు ఆవల వైపున కూడా సుమారు 20 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని, 2 అవార్డులు(చెట్లకు నష్ట పరిహారం) చెల్లించలేదని బాధిత రైతులు తెలిపారు. -
పునరావాస పనుల అడ్డగింత
= వెలిగొండ నిర్వాసితుల కోసం పూసలపాడు వద్ద భూమి కేటాయింపు = కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో పనులు ఎలా చేస్తారని రైతుల ప్రశ్న = ఇప్పటికి నాలుగు సార్లు పనులు అడ్డుకున్న రైతులు బేస్తవారిపేట : వెలిగొండ ప్రాజెక్ట్ పునరా వాస పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. నివేశన స్థలాల కోసం కేటా యించిన భూ వివాదం కోర్టులో ఉండగా పనులు ఎలా చేస్తారంటూ రైతులు ప్ర శ్నించారు. ఈ సంఘటన మండలంలోని పూసలపాడు సమీపంలో శనివారం జరిగింది. పూసలపాడు బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవే రోడ్డు పక్కన వెలిగొండ ప్రాజెక్ట్ కాకర్ల గ్యాప్ ముంపు బాధితులకు 20 ఎకరాల్లో 280 ప్లాట్లు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తోట ఆదినారాయణ, నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చాగంటి ఎర్ర గంగయ్య, నరసింహులు, తిరుపాలు, చిన్న కొండలు అనే రైతులు తమ భూములు ఇచ్చేది లేదంటూ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో వివాదం నడుస్తోంది. పొలాల పక్కనున్న అసైన్డ్ భూములు తీసుకోకుండా తమ వద్ద ఉన్న అరకొర భూములు బలవంతంగా ఎందుకు లాక్కుంటున్నారని, కనీసం ఎటువంటి నోటీస్‌లు కూడా ఇవ్వకుండానే భూములు చదును చేస్తున్నారంటూ రైతులు డోజర్ యంత్రానికి అడ్డుపడ్డారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో పనులు ఏ విధంగా చేయిస్తారని అక్కడే పనులు చేయిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ జేఈ సుధాకర్‌ను ప్రశ్నించారు. పనులు నిలిపేయాలని కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011లో మార్కాపురం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, 19 ఎకరాలకు రూ.14 లక్షలను కోర్టులో డిపాజిట్ చేసినట్లు జేఈ వివరించారు. -
అవసరం కొండంత..ఇచ్చింది గోరంత
► జిల్లాపై బాబు శీతకన్ను ► బడ్జెట్లో వెలిగొండకు కేటాయించింది రూ.200 కోట్లే ► ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం ► కొరిశపాడు లిఫ్ట్‌కు ఇచ్చింది రూ.7.45 కోట్లు ► పాలేరు రిజర్వాయర్‌కు రూ.3.98 కోట్లు ► రాళ్లపాడుకు రూ.1.28 కోట్లు ► ఊసే లేని రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కో హామీని గాలికొదిలేసింది. ఆది నుంచి జిల్లా అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. తాజా బడ్జెట్లోనూ మొండిచేయి చూపింది. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టగా..జిల్లా అభివృద్ధికి కీలకమైన పోర్టు, విమానాశ్రయం, పారిశ్రామికవాడల ఊసే ఎత్తలేదు. సంక్షేమ పథకాల అమలుకూ మొక్కుబడిగా నిధులిచ్చి చేతులు దులుపుకున్నారు. బడ్జెట్లో జిల్లాను చిన్నచూపు చూడటంపై జనం మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు 2017–18 బడ్జెట్లో బాబు సర్కారు మొండిచేయి చూపింది. జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామంటూనే సర్కారు వంచనకు పాల్పడింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.2,800 కోట్లు అవసరం కాగా, బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.200 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టే పరిస్థితి నెలకొంది. రూ.1,56,980 కోట్ల బడ్జెట్ అంటూ ఘనంగా చెప్పుకున్న బాబు సర్కారు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అరకొర నిధులు విదల్చగా ఇక జిల్లాకు ఇచ్చిన ప్రధాన హామీలు రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం, మైనింగ్ యూనివర్సిటీ, కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ మొదలుకొని ఏ ఒక్క హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. వెలిగొండకు చిల్లర విదిలింపు: తాజా అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం. కనీసం ఫేజ్–1 పరిధిలోని టన్నెల్–1, హెడ్‌రెగ్యులేటర్ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకే వెయ్యి కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతా క్రమంలో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించినా... బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి మొక్కుబడి నిధులతో సరిపెట్టారు. ఇప్పటికే పాత బకాయిలు రూ.50 కోట్లు ఉన్నాయి. వాటికి పోను కేటాయింపులు చూస్తే కేవలం రూ.150 కోట్లు ఇచ్చినట్లు. జిల్లాలోని కరువును పారదోలటంతో పాటు ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యం. జిల్లా వాసులకు తాగు, సాగునీరుకు ఈ ప్రాజెక్టే ఏకైక ఆధారం. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.40 లక్షల ఎకరాలకు, వందలాది గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాల్సి ఉంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. దాని నిధుల కేటాయింపులు చూస్తే మరో దశాబ్ద కాలానికి కూడా వెలిగొండ పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా అందదు. మిగిలిన ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులే..: కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.125 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.7.45 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పాలేరు రిజర్వాయర్ పరిధిలో రూ.50 కోట్లు అవసరం కాగా రూ.3.98 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రాళ్లపాడు స్టేజ్–2 పనులకు రూ.1.28 కోట్లు, వీరరాఘవునికోట ప్రాజెక్టుకు రూ.1.8 కోట్లు, కంభం చెరువుకు రూ.28 లక్షలు, పాలేటి బిట్రగుంట పనులకు రూ.45 లక్షలు, ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ డ్రైనేజీ పనులకు రూ.45 లక్షల చొప్పున కేటాయించారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి తాజా బడ్జెట్లో రూ.266.73 కోట్లు కేటాయించినట్లు లెక్కల్లో చూపారు. వాస్తవానికి గుండ్లకమ్మ ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం నిధుల కేటాయింపులు లేవు. పట్టుమని రూ.20 నుంచి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తే పనులు పూర్తయ్యేవి. అయితే చంద్రబాబు సర్కారు వచ్చాక బడ్జెట్ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లలోపు నిధులు అయితే సరిపోతాయని అధికారులు తాజా అంచనాలు ప్రభుత్వానికి పంపారు. విచిత్రమేమిటంటే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.266.73 కోట్లు కేటాయించటం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున దోచుకునేందుకే అంచనాలను భారీగా పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.103.56 కోట్లు కేటాయించారు. మొత్తంగా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు చంద్రబాబు సర్కారు నిధుల కేటాయింపుల్లో మొండిచేయి చూపిందని చెప్పాలి. పోర్టు..పారిశ్రామిక కారిడార్ల ఊసేదీ..: బడ్జెట్లో రామాయపట్నం ఊసే లేదు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్, కనిగిరి నిమ్జ్‌లను ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. విమానాశ్రయం సంగతి మరిచారు. నిరుద్యోగ భృతికి కేవలం రూ.500 కోట్లను కేటాయించటం చూస్తే బాబు సర్కారు చిత్తశుద్ధి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా మొత్తం బడ్జెట్లో వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిలే జిల్లా స్థాయిలో రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. ఇక డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి, రైతు రుణమాఫీలకు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లకుపైగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని బాబు సర్కారు గతంలో పలుమార్లు చెప్పినా బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. ఇక పేదలకు అడిగినన్ని గృహాలు కట్టిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చినా అవేమీ నెరవేరలేదు. తాజాగా లక్షల గృహాలు నిర్మిస్తామంటూ బాబు సర్కారు ప్రకటించిన ఆ స్థాయిలో నిధుల కేటాయింపుల్లేకపోవడం గమనార్హం. మొత్తంగా 2017–18 బాబు బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నీటి సమస్యకు పరిష్కారం వెలిగొండ
► పశ్చిమ ప్రకాశంలో తాగునీటి సమస్య తీవ్రతరం ► మూడేళ్లుగా ముందుకు సాగని వెలిగొండ ప్రాజెక్టు పనులు ► వచ్చే బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలి ► ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గిద్దలూరు : వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితేనే జిల్లాలో తాగు, సాగు నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు దివంగత ముఖ్యమంత్రి ప్రారంభించిన వెలిగొండను పూర్తి చేయాలని, ఇందుకోసం రానున్న బడ్జెట్లో రూ.1000 కోట్లు మంజూరు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిద్దలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ నిధులు పాతబిల్లులకే సరి...: అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లవుతున్నా పనులు ముందుకు కదల్లేదని ఎంపీ వైవీ విమర్శించారు. ఏటా రూ.75కోట్లు, రూ.153కోట్లు, రూ.200కోట్లు చొప్పున నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారని ఆరోపించారు. ఇంత తక్కువ నిధులు కాంట్రాక్టర్ల పాతబిల్లులు చెల్లించేందుకే సరిపోవన్నారు. వరుసగా మూడేళ్ల పాటు కరువు ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నేటికీ ప్రత్యామ్నాయ చర్యలు ఆలోచించకపోవడం దారుణమన్నారు. గిద్దలూరులో గుండ్లమోటు, బైరేనిగుండాల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశంపై వివక్ష తగదు..: కృష్ణా నుంచి జిల్లాకు ఆరు టీఎంసీల సాగర్ జలాలు కేటాయిస్తే ఇందులో నాలుగు టీఎంసీలు రాబట్టుకోలేని దౌర్భాగ్యస్థితి జిల్లాలో ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఆ నీటితో 250 చెరువులు మాత్రమే నింపారని, మరో 120 చెరువులు నింపాల్సి ఉందన్నారు. ఇక నీరు వస్తుందో లేదో తెలియదని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అనంతపురం తర్వాత అత్యంత కరువు జిల్లా ప్రకాశం అని, జిల్లా ప్రజలకు కాపాడుకోవాల్సిన అవసరం టీడీపీకి లేనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేవలం అమరావతి, పట్టిసీమ, పురుషోత్తముని ప్రాజెక్టు అంటూ కొన్నింటిని పట్టుకుని వేలాడుతూ.. ప్రజలను గాలికొదిలేశారని మండి పడ్డారు. జిల్లాపై వివక్షత చూపుతున్నారన్నారు. జిల్లాలో ప్లోరైడ్ ప్రభావితం ఎక్కువగా ఉందని, ఇప్పటి వరకు 420మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారని ఆవేదన చెందారు. ప్రజల ప్రాణాలతో సర్కారు చెలగాటం..: ఏడాది కాలంగా జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, జనవరి 18న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తున్నారని తెలిసి మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడిగా ప్రకటించిన ప్రభుత్వం రెండు నెలలవుతున్నా ఏర్పాటు కాలేదన్నారు. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రి నడ్డాతో తాను మాట్లాడానని చెప్పారు. జిల్లాలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు తన ఎంపీ నిధుల నుంచి రూ.12లక్షలు కేటాయించానని అయినప్పటికీ ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలపై ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో అంతకు మించిన వ్యతిరేకత టీడీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ముందకురావాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, పార్టీ నాయకులు అభిషేక్‌రెడ్డి, కె.వి.రమణారెడ్డి, యేలం వెంకటేశ్వరరావు, చెన్ను విజయ, జజ్జల ఆనందరావు రెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.