పునరావాస పనుల అడ్డగింత
= వెలిగొండ నిర్వాసితుల కోసం పూసలపాడు వద్ద భూమి కేటాయింపు
= కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో పనులు ఎలా చేస్తారని రైతుల ప్రశ్న
= ఇప్పటికి నాలుగు సార్లు పనులు అడ్డుకున్న రైతులు
బేస్తవారిపేట : వెలిగొండ ప్రాజెక్ట్ పునరా వాస పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. నివేశన స్థలాల కోసం కేటా యించిన భూ వివాదం కోర్టులో ఉండగా పనులు ఎలా చేస్తారంటూ రైతులు ప్ర శ్నించారు. ఈ సంఘటన మండలంలోని పూసలపాడు సమీపంలో శనివారం జరిగింది. పూసలపాడు బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవే రోడ్డు పక్కన వెలిగొండ ప్రాజెక్ట్ కాకర్ల గ్యాప్ ముంపు బాధితులకు 20 ఎకరాల్లో 280 ప్లాట్లు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
తోట ఆదినారాయణ, నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చాగంటి ఎర్ర గంగయ్య, నరసింహులు, తిరుపాలు, చిన్న కొండలు అనే రైతులు తమ భూములు ఇచ్చేది లేదంటూ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో వివాదం నడుస్తోంది. పొలాల పక్కనున్న అసైన్డ్ భూములు తీసుకోకుండా తమ వద్ద ఉన్న అరకొర భూములు బలవంతంగా ఎందుకు లాక్కుంటున్నారని, కనీసం ఎటువంటి నోటీస్‌లు కూడా ఇవ్వకుండానే భూములు చదును చేస్తున్నారంటూ రైతులు డోజర్ యంత్రానికి అడ్డుపడ్డారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో పనులు ఏ విధంగా చేయిస్తారని అక్కడే పనులు చేయిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ జేఈ సుధాకర్‌ను ప్రశ్నించారు. పనులు నిలిపేయాలని కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011లో మార్కాపురం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, 19 ఎకరాలకు రూ.14 లక్షలను కోర్టులో డిపాజిట్ చేసినట్లు జేఈ వివరించారు.