
తటాకాన్ని తలపిస్తున్న రెండో సొరంగం
పెద్దదోర్నాల: మండల పరిధి కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ పనులకు సంబంధించి రెండో సొరంగ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున నీరు చేరడంతో ఆ ప్రాంతం తటాకాన్ని తలిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షంతో పాటు సొరంగ మార్గం ద్వారా వచ్చే ఊట నీరు భారీగా చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సాధారణంగా సొరంగ మార్గాల నుంచి వచ్చే ఊట నీటిని పనులు జరిగే ప్రాంతం నుంచి బయటకు తరలించేందుకు ప్రత్యేకంగా పంపింగ్ వ్యవస్థను రూపొందించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా పేరుకు పోయాయన్న కారణంతో విధ్యుత్ శాఖాధికారులు గత నెల 24వ తేదీన ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపేశారు. గుత్తేదారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసి మోటార్లతో నీరు తోడే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, నిర్వహణలో అధిక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో జనరేటర్లను రెండు విడతలుగా వినియోగించి నీరు తోడే పనులు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జనరేటర్లను పొదుపుగా వినియోగిస్తుండటంతో సొరంగ నిర్మాణ ప్రాంతంలో తరుచూ నీరు నిలబడి మడుగును తలపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment