సంఘటన స్థలం వద్ద భారీగా చేరుకున్న స్థానికులు
పెద్దదోర్నాల: గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనముక్కల సమీపం వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ వద్ద సోమవారం వెలుగు చూసింది. హత్య ఆదివారం రాత్రి జరిగినట్లు భావిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు పెట్రోలు పోసి నిప్పటించడంతో ముఖం పూర్తిగా గుర్తించలేని స్థితిలో ఉంది. తీగలేరు కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, సీఐ మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఆనవాళ్లు సేకరించారు.
డీఎస్పీ కథనం ప్రకారం.. మృతుడికి 35 నుంచి 40 ఏళ్లు ఉండొచ్చు. మృతుడు నల్ల రంగు ప్యాంట్‌తో పాటు తెలుపు, ఇటుక రంగు చిన్న గళ్ల షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడిని ఎక్కడైనా చంపి ఇక్కడికి తెచ్చి పడవేశారా, లేక ఇక్కడే హతమార్చి తగులబెట్టారా.. అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతుడి ఆనవాళ్లని గుర్తించి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్యరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. సంఘటన స్థలంలో స్థానికంగా ఉన్న ఓ మద్యం షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌తో పాటు, రెండు అగ్గిపెట్టెలను ఎస్‌ఐ రామకోటయ్య స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి మృతదేహం కాలువలో పడేశారన్న వార్త దావానలంలా వ్యాపించడంలో మండల కేంద్రంతో పాటు సమీప గ్రామాలైన ఐనముక్కల, యడవల్లి గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment