unwanted persons
-
అపరిచితులొస్తున్నారు..
తస్మాత్జాగ్రత్త.. కాలనీల్లో అపరిచితులు తిరుగుతూ ఉన్నారు.. మీ ఇంటికేసీ తదేకంగా చూస్తు ఉంటారు..తాళాలున్న ఇళ్లను గమనిస్తుంటారు.. సమాచారం సేకరిస్తూ ఉంటారు.. జాగ్రత్తగా ఉండండి.. నిర్లక్ష్యం చేశారో.. మీ ఇళ్లు గుల్ల చేసి పోతారు.. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అనుమానిత వ్కక్తుల అలజడి ఎక్కువైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో ఇద్ద రు కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. ఒ బంగ్లా వద్ద తచ్చా డుతుండగా పక్క ఇంట్లో ఉన్న రమేశ్ గమనించి వారిని ఎవ రు మీరని వాకాబు చేసేలోగా వాళ్లు అక్కడినుంచి ఉడాయిం చారు. ఏం జరగలేదని ఊపిరిపీల్చుకుంటుండంగా మరుసటి రోజు కాలనీలో ఉన్న తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఇలాంటి సంఘటనలు జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీల్లో నిత్యం రమేశ్‌లాంటి వారికి ఎదురవుతూనే ఉన్నాయి. అపరిచిత వ్యక్తుల కదలికలు రోజురోజుకు కామారెడ్డిలో పెరుగుతుండడం కలవరపెడుతోంది. కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంలో అపరిచిత వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల ముఠాలు.. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో గతంలో జరిగిన దొంగతనాలు, దోపిడీలను పరిశీలిస్తే చుట్టు పక్కల రాష్ట్రాల దొంగల ముఠాలే చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యాణా, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు తమ కార్యకలాపాలను ఇది వరకు మన జిల్లాలో కొనసాగించి పట్టుబడ్డాయి. పట్టణంలోని పోలీస్ కార్యాలయానికి దగ్గల్లో భవానీనగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి 6.30 లక్షలు, 34 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. వారిని గమనించిన కాలనీవాసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా రైలుపట్టాలు దాటి పరుగులు తీశారు. వారిలో ఒకడిని స్నేహాపూరి కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. పట్టబడ్డవారు తమిళనాడు వారని తెలిసింది. కూలీ నిమిత్తం జగిత్యాలలో ఉండి కొంత కాలం క్రితమే కామారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది. నిఘా వైఫల్యం..? పట్టణానికి వస్తున్న అపరిచిత వ్యక్తులు ఎక్కువగా శివారు ప్రాంతాలు, లాడ్జిల్లో బస చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించడంలో పోలీసుల చర్యలు అంతంతమాత్రంగానే కనపిస్తున్నాయి. జిల్లాలోని చాలా చోట్ల పోలీసులు నిరంతరంగా కార్డన్‌సర్చ్‌లు చేపడుతున్నారు. ప్రతిసారి ధృవపత్రాలు లేని వాహనాలు, గుర్తింపు కార్డులు లేని కొత్త వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. కానీ విచారించి వదిలేస్తున్నారు. వీరిలో ఎంతో మంది నకిలీ ధృవపత్రాలు, గుర్తింపు కార్డులు చూపించి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరు వ్యాపారాల ముసుగులో.. కామారెడ్డి పట్టణం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుండడంతో దొంగల కన్ను పట్టణంపై పడుతోంది. దుస్తుల అమ్మకం, దుప్పట్ల అమ్మకం, సోఫా రిపేర్లు, మంచాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు చేస్తామంటు, మరమ్మత్తులు చేస్తామంటు ఎంతో మంది చిరువ్యాపారులు కాలనీలలో ఇంటింటికీ తిరుగుతున్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు అపరిచి వ్యక్తులను నమ్మవద్దు. గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వారి కదలికలను గమనిస్తు, పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. పోలీస్‌శాఖ తరపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నం. తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా, చర్యలు కొనసాగిస్తాం.– శ్రీధర్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి -
పోలీసుల అదుపులో అపరిచిత మహిళలు
అచ్చంపేట(పెదకూరపాడు): అనుమానాస్పదంగా సంచరిస్తున్న అయిదుగురు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన మండలంలోని కస్తల గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామంలో అపరిచిత వ్యక్తులు అయిదుగురు ఆటోలో వచ్చి అటు ఇటు తిరుగుతుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వారిలో ఒకరు ఆటో డ్రైవరు కాగా మిగిలిన వారు నలుగురు స్త్రీలు. ఎక్కడినుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే తలా ఒక సమాధానం చెప్పడంతో గ్రామస్తులు వీరిని పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలుగా అనుమానించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో వీరిని తీసుకువచ్చిన డ్రైవర్ పరారయ్యాడు. స్పీడుగా ఆటో నడుపుకుండా అచ్చంపేట వైపు వచ్చే క్రమంలో పలువురిని ఢీకొట్టి గాయపరిచాడు. ఈ క్రమంలోనే సైకిల్‌పై వెళుతున్న అచ్చంపేటకు చెందిన షేక్ శిలారు అనే బాలుడిని ఢీకొట్టాడు. దీంతో కొందరు యువకులు బైకులపై వెంబడించి స్థానిక గురుకుల పాఠశాల వద్ద అదుపులోకి తీసుకుని ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన ఫక్కీలో అడగడంతో తాను నలుగురు మహిళలతో వచ్చానని, తమది కృష్ణాజిల్లా జగ్గయ్యపేటగా చెప్పాడు. తన పేరు అయ్యప్ప అని ఒకసారి, పాపయ్య అని ఒకసారి రకరకాలుగా చెప్పాడు. కస్తల గ్రామస్తులు అదుపులోకి తీసుకున్న నలుగురు మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరంతా గ్రామంలోకి వచ్చి దొంగతనాలు చేస్తుంటారని, రోజుకొక గ్రామం తిరుగుతారని, ఈ క్రమంలోనే కస్తల వచ్చినట్టు సమాచారం. అచ్చంపేటలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే వారు వచ్చారంటూ వార్తలు రావడంతో వారిని చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. -
గుర్తు తెలియని వ్యక్తి హత్య
పెద్దదోర్నాల: గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనముక్కల సమీపం వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ వద్ద సోమవారం వెలుగు చూసింది. హత్య ఆదివారం రాత్రి జరిగినట్లు భావిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు పెట్రోలు పోసి నిప్పటించడంతో ముఖం పూర్తిగా గుర్తించలేని స్థితిలో ఉంది. తీగలేరు కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, సీఐ మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఆనవాళ్లు సేకరించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మృతుడికి 35 నుంచి 40 ఏళ్లు ఉండొచ్చు. మృతుడు నల్ల రంగు ప్యాంట్‌తో పాటు తెలుపు, ఇటుక రంగు చిన్న గళ్ల షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడిని ఎక్కడైనా చంపి ఇక్కడికి తెచ్చి పడవేశారా, లేక ఇక్కడే హతమార్చి తగులబెట్టారా.. అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతుడి ఆనవాళ్లని గుర్తించి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్యరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. సంఘటన స్థలంలో స్థానికంగా ఉన్న ఓ మద్యం షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌తో పాటు, రెండు అగ్గిపెట్టెలను ఎస్ఐ రామకోటయ్య స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి మృతదేహం కాలువలో పడేశారన్న వార్త దావానలంలా వ్యాపించడంలో మండల కేంద్రంతో పాటు సమీప గ్రామాలైన ఐనముక్కల, యడవల్లి గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. -
మహిళను దారుణంగా చంపారు...
మహబూబ్‌నగర్: ఓ మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేశారు. వివరాలు....మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టువాగు సమీపంలోని పొలాల్లో బురదమన్నులో ఓ మహిళ మృతదేహం కూరుకుపోయి ఉండగా శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని బురదమన్నులో పూడ్చేసినట్లు భావిస్తున్నారు. మృతురాలు చిన్నచింతకుంటకు చెందిన యాదగిరి పోశమ్మ (55)గా గుర్తించారు. (చిన్నచింతకుంట)