కస్తల గ్రామస్తులు పోలీసులకు అప్పగించిన అపరిచిత మహిళలు
అచ్చంపేట(పెదకూరపాడు): అనుమానాస్పదంగా సంచరిస్తున్న అయిదుగురు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన మండలంలోని కస్తల గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామంలో అపరిచిత వ్యక్తులు అయిదుగురు ఆటోలో వచ్చి అటు ఇటు తిరుగుతుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వారిలో ఒకరు ఆటో డ్రైవరు కాగా మిగిలిన వారు నలుగురు స్త్రీలు. ఎక్కడినుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే తలా ఒక సమాధానం చెప్పడంతో గ్రామస్తులు వీరిని పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలుగా అనుమానించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో వీరిని తీసుకువచ్చిన డ్రైవర్ పరారయ్యాడు. స్పీడుగా ఆటో నడుపుకుండా అచ్చంపేట వైపు వచ్చే క్రమంలో పలువురిని ఢీకొట్టి గాయపరిచాడు.
ఈ క్రమంలోనే సైకిల్‌పై వెళుతున్న అచ్చంపేటకు చెందిన షేక్ శిలారు అనే బాలుడిని ఢీకొట్టాడు. దీంతో కొందరు యువకులు బైకులపై వెంబడించి స్థానిక గురుకుల పాఠశాల వద్ద అదుపులోకి తీసుకుని ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన ఫక్కీలో అడగడంతో తాను నలుగురు మహిళలతో వచ్చానని, తమది కృష్ణాజిల్లా జగ్గయ్యపేటగా చెప్పాడు. తన పేరు అయ్యప్ప అని ఒకసారి, పాపయ్య అని ఒకసారి రకరకాలుగా చెప్పాడు. కస్తల గ్రామస్తులు అదుపులోకి తీసుకున్న నలుగురు మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరంతా గ్రామంలోకి వచ్చి దొంగతనాలు చేస్తుంటారని, రోజుకొక గ్రామం తిరుగుతారని, ఈ క్రమంలోనే కస్తల వచ్చినట్టు సమాచారం. అచ్చంపేటలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే వారు వచ్చారంటూ వార్తలు రావడంతో వారిని చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment