జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీవాసులకు చిక్కిన దొంగ (ఫైల్)
తస్మాత్‌జాగ్రత్త.. కాలనీల్లో అపరిచితులు తిరుగుతూ ఉన్నారు.. మీ ఇంటికేసీ తదేకంగా చూస్తు ఉంటారు..తాళాలున్న ఇళ్లను గమనిస్తుంటారు.. సమాచారం సేకరిస్తూ ఉంటారు.. జాగ్రత్తగా ఉండండి.. నిర్లక్ష్యం చేశారో.. మీ ఇళ్లు గుల్ల చేసి పోతారు.. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అనుమానిత వ్కక్తుల అలజడి ఎక్కువైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో ఇద్ద రు కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. ఒ బంగ్లా వద్ద తచ్చా డుతుండగా పక్క ఇంట్లో ఉన్న రమేశ్ గమనించి వారిని ఎవ రు మీరని వాకాబు చేసేలోగా వాళ్లు అక్కడినుంచి ఉడాయిం చారు. ఏం జరగలేదని ఊపిరిపీల్చుకుంటుండంగా మరుసటి రోజు కాలనీలో ఉన్న తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఇలాంటి సంఘటనలు జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీల్లో నిత్యం రమేశ్‌లాంటి వారికి ఎదురవుతూనే ఉన్నాయి. అపరిచిత వ్యక్తుల కదలికలు రోజురోజుకు కామారెడ్డిలో పెరుగుతుండడం కలవరపెడుతోంది. కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంలో అపరిచిత వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల ముఠాలు..
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో గతంలో జరిగిన దొంగతనాలు, దోపిడీలను పరిశీలిస్తే చుట్టు పక్కల రాష్ట్రాల దొంగల ముఠాలే చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యాణా, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు తమ కార్యకలాపాలను ఇది వరకు మన జిల్లాలో కొనసాగించి పట్టుబడ్డాయి. పట్టణంలోని పోలీస్ కార్యాలయానికి దగ్గల్లో భవానీనగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి 6.30 లక్షలు, 34 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. వారిని గమనించిన కాలనీవాసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా రైలుపట్టాలు దాటి పరుగులు తీశారు. వారిలో ఒకడిని స్నేహాపూరి కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. పట్టబడ్డవారు తమిళనాడు వారని తెలిసింది. కూలీ నిమిత్తం జగిత్యాలలో ఉండి కొంత కాలం క్రితమే కామారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది.
నిఘా వైఫల్యం..?
పట్టణానికి వస్తున్న అపరిచిత వ్యక్తులు ఎక్కువగా శివారు ప్రాంతాలు, లాడ్జిల్లో బస చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించడంలో పోలీసుల చర్యలు అంతంతమాత్రంగానే కనపిస్తున్నాయి. జిల్లాలోని చాలా చోట్ల పోలీసులు నిరంతరంగా కార్డన్‌సర్చ్‌లు చేపడుతున్నారు. ప్రతిసారి ధృవపత్రాలు లేని వాహనాలు, గుర్తింపు కార్డులు లేని కొత్త వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. కానీ విచారించి వదిలేస్తున్నారు. వీరిలో ఎంతో మంది నకిలీ ధృవపత్రాలు, గుర్తింపు కార్డులు చూపించి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
చిరు వ్యాపారాల ముసుగులో..
కామారెడ్డి పట్టణం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుండడంతో దొంగల కన్ను పట్టణంపై పడుతోంది. దుస్తుల అమ్మకం, దుప్పట్ల అమ్మకం, సోఫా రిపేర్లు, మంచాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు చేస్తామంటు, మరమ్మత్తులు చేస్తామంటు ఎంతో మంది చిరువ్యాపారులు కాలనీలలో ఇంటింటికీ తిరుగుతున్నారు.
అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు
అపరిచి వ్యక్తులను నమ్మవద్దు. గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వారి కదలికలను గమనిస్తు, పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. పోలీస్‌శాఖ తరపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నం. తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా, చర్యలు కొనసాగిస్తాం.– శ్రీధర్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment