మహా దాహం! | water problems in hyderabad | Sakshi
Sakshi News home page

మహా దాహం!

Published Sat, Nov 7 2015 2:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మహా దాహం! - Sakshi

మహా దాహం!

నెలాఖరుకు జంట జలాశయాలు ఖాళీ
13 ఏళ్ల తరవాత ఈ పరిస్థితి
ఇప్పటికే కొన్ని డివిజన్లకు కోతలు షురూ
బల్క్ కనెక్షన్లకు నీళ్లు బంద్ అంటూ జలమండలి లేఖలు
కృష్ణా, గోదారి నీళ్లు రాకుంటే కటకటే

 
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో నీటి కటకట మండు వేసవిని తలపిస్తోంది. శీతాకాలంలోనూ జనం గొంతెండుతోంది.  హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వట్టి పోతుండడంతో దాదాపు 13 ఏళ్ల తరువాత ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఈ సీజన్‌లో పుష్కలంగా నీటితో కళకళలాడాల్సిన జలాశయాలు అంతకంతకూ నిల్వలు తగ్గి బావురుమంటున్నాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట్)ల్లో నీటి నిల్వలు ఈ నెలాఖరుకి డెడ్ స్టోరేజికి చేరుకోనున్నాయి. మరో రెండు నెలల్లో సింగూరు, మంజీరా జలాశయాలదీ అదే దుస్థితి. దీంతో నగరానికి నీటి కోతలు మరింత తీవ్రమయ్యేలా ఉంది.
 
 ఈ నెలాఖరు నాటికి కృష్ణా మూడోదశ ద్వారా 90 ఎంజీడీలు, డిసెంబరు 15 నాటికి గోదావరి మొదటి దశ ద్వారా 172 ఎంజీడీల నీటిని తరలించని పక్షంలో నగరంలో పానీ పరేషాన్ తీవ్రం కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పొదుపుగా వాడుకునేందుకు జలమండలి పలు డివిజన్లకు నీటి కోతలు విధిస్తోంది. అంతేకాదు నగర శివార్లలో సింగూరు, మంజీరా జలాలు అందించే పలు గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరా త్వరలో నిలిచిపోనుందని లేఖలు రాయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్టోబరులో 365 ఎంజీడీల నీటిని నగరవ్యాప్తంగా సరఫరా చేసిన బోర్డు.. నవంబరు తొలి వారంలో 358 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తోంది. డిసెంబరులో ఇది 354 ఎంజీడీలకే పరిమితం కానుందని ప్రకటించింది.
 
 అంతకంతకూ తగ్గుతూ...
 ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయం గరిష్ట మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1758.270 అడుగులకు, హిమాయత్‌సాగర్ గరిష్ట మట్టం 1763.500 అడుగుల నుంచి 1738.600 అడుగులకు పడిపోయింది. ఈ సీజన్‌లో ఈ రెండు జలాశయాల నుంచి రోజువారీగా 40 ఎంజీడీల నీటిని జలమండలి సేకరించేది. ప్రస్తుతం 15.70 ఎంజీడీలనే సేకరిస్తోంది. ఈ నెలాఖరుకి ఈ జలాశయాలు డెడ్ స్టోరేజికి చేరుకునే పరిస్థితి ఉండడంతో నీటిని సేకరించడం కష్ట సాధ్యమౌతుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సింగూరు జలాశయం గరిష్ట మట్టం 1717.932 అడుగులకు ప్రస్తుతం 1679.580 అడుగుల వరకే నీళ్లున్నాయి. మంజీరా జలాశయంలో 1651.750 అడుగులకు ప్రస్తుతం 1641.300 అడుగుల వరకు నిల్వలున్నాయి.
 
 అక్కంపల్లి జలాశయం గరిష్ట మట్టం 245 మీటర్లకు 243.500 మీటర్లవరకే నిల్వలున్నాయి. నాగార్జునసాగర్ గరిష్ట మట్టం 590 అడుగులకు 510.500 అడుగుల వరకే నీళ్లున్నాయి. మొత్తంగా నగర దాహార్తిని తీర్చే అన్ని జలాశయాల్లో గరిష్టంగా 39.783 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతానికి 2.989 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్హం. జలాశయాల ఎగువ ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో పూడిక పేరుకు పోవడం, వరద నీటిని తీసుకొచ్చే ఇన్ ఫ్లో చానల్స్ మూసుకుపోవడం వంటి కారణాలతో ఈ దుస్థితి వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు.
 
 మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాల నుంచి జలమండలి 110 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తోంది. దీనిపై నీటి పారుదల శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటిల్లో నీటి మట్టాలు అనూహ్యంగా పడిపోవడంతో మెదక్ జిల్లా సాగునీటి అవసరాలకు ఉన్న నీళ్లు సరిపోవని పేచీ పెడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గోదావరి నీళ్లు వచ్చే వరకు కోతలు విధించవద్దని నీటిపారుదల శాఖకు జలమండలి లేఖ రాసినట్లు సమాచారం.
 
 మీ బాధ మీరు పడండి..!  
 సింగూరు, మంజీరా జలాశయాల నుంచి వచ్చే నీటికి భారీగా కోత పడిన నేపథ్యంలో పలు గేటెడ్ కమ్యూనిటీలకున్న బల్క్ (బడా) కనెక్షన్లకు త్వరలో సరఫరా నిలిపివేస్తామని జలమండలి అధికారులు తాజాగా లేఖలు రాశారు. ప్రధానంగా నార్సింగి, మణికొండ ప్రాంతాల్లోని రాజపుష్ప తదితర 10 గేటెడ్ కమ్యూనిటీలు, పటాన్‌చెరు పరిధిలోని 235 బడా కనెక్షన్‌దారులకు ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీరే చూసుకోవాలి’ అంటూ లేఖలు పంపారు. అయితే ప్రస్తుతం అందిస్తున్న నీటి పరిమాణంలో కోతలు విధించి నీటిని పొదుపుగా సరఫరా చేయనున్నట్లు జలమండలి ట్రాన్స్‌మిషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వినియోగదారులను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకే ఈ లేఖలు రాశామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement