సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరవు ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన పశ్చిమ మండలాలకు కృష్ణా వరద జలాలను తరలించి.. తాగు, సాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి సిద్ధమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) నుంచి 8 టీఎంసీలను తరలించి.. కురుబలకోట మండలం ముదివేడులో 1.5, పుంగనూరు మండలం నేతిగుంటపల్లిలో 1, సోమల మండలం ఆవులపల్లిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలో నిల్వ చేయనుంది.
తద్వారా కొత్తగా 70 వేల ఎకరాలు, చెరువుల కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. మిగిలిన 2 టీఎంసీలను పీలేరు, కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల పరిధిలోని 33 మండలాల ప్రజలకు తాగు నీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,144.50 కోట్లతో గతేడాది సెపె్టంబర్ 2న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.1,554.21 కోట్ల వ్యయంతో (మిగతాది భూ సేకరణకు) 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. ఆమోదం రాగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి.. గడువులోగా పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది.
మూడు రిజర్వాయర్లకు నీటి తరలింపు ఇలా..
– వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలగా పిలుస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు.
– మిగతా 1550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు.
– అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు.
– పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి.. పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు.
– పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి.. సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీని ద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment